అర్ధాకలిలో అమ్మ భక్తులు

11 Sep, 2016 22:29 IST|Sakshi
అర్ధాకలిలో అమ్మ భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
అమ్మవారి ప్రసాదం స్వీకరించడం మహాభాగ్యం.... అది అన్నప్రసాదమయినా.. ఇతర మరే ప్రసాదమయినా సరే... అయితే భక్తులు, యాత్రికుల కోసం సిద్ధం చేసిన ప్రసాదం కూలీలు, కార్మికుల పాలవుతోంది. అమ్మ సన్నిధిలో నిద్ర చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మవారి సన్నిధిలో రాత్రి వేళ నిద్ర చేసేందుకు రాష్ట్రంలోని వివిధ‡ ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. వీరందరికీ దుర్గగుడి అధికారులు నిత్యం దద్దోజనం ప్రసాదాన్ని అందజేస్తుంటారు. రాత్రి  8–30 గంటల నుంచి ఈ  ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. గతంలో కొండపై షెడ్డులో ఈ దద్దొజనం ప్రసాదం అందజేసేవారు. అయితే మహా మండపంలోని 1, 2వ అంతస్తులో భక్తులు నిద్ర చేసేందుకు వసతి కల్పించడంతో ఇప్పుడు మహా మండపం దిగువన ఈ ప్రసాదాన్ని రాత్రి వేళ పంపిణీ చేస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసే ఈ ప్రసాదం కోసం కెనాల్‌ రోడ్డు, కాళేశ్వరరరావు మార్కెట్‌ పరిసరాలలో హోటళ్లు,  ఇతర పనులు చేసుకునే కూలీలు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచే మహా మండపం దిగువన వరసగా కూర్చుని ఉండటంతో నిజమైన భక్తులకు అమ్మవారి ప్రసాదం అందడం లేదు. తొలుత క్యూలైన్‌లోకి ఈ కూలీలు వచ్చి  చేరడంతో భక్తులు వారి వెనుక నిల్చోవాల్సి వస్తుంది. చివరకు అరకొరగా లభించే ప్రసాదాన్ని కుటుంబం మొత్తం సర్దుకుని ఆర్ధాకలిలో అమ్మవారి సన్నిధిలో నిద్ర చేయాల్సి వస్తుందని అనకాపల్లికి చెందిన వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. అన్న ప్రసాదం పంపిణీకి పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్లు వినియోగించుకుని భక్తులందరినీ ఓ క్రమపద్ధతిలో వచ్చేలా చేయవచ్చు. ఆలయ సిబ్బంది అటువంటి చర్యలేమీ పాటించకుండా ఆరుబయట భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నోరు, బలం ఉన్న వారు ముందుకు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని భోజనంలా లాగించేస్తున్నారు. 
విశ్రాంతి మందిరాలలోనే పంపిణీ చేస్తే మేలు....
అమ్మవారి సన్నిధిలో నిద్ర చేసేందుకు వచ్చే భక్తులు, యాత్రికులకు పంపిణీ చేసే దద్దోజన ప్రసాదాన్ని విశ్రాంతి మందిరాలలోనే పంపిణీ చేస్తే సద్వినియోగం భక్తులు భావిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో నిత్యం 300 నుంచి  500 మంది వరకు భక్తులు నిద్ర చేస్తుంటారు. భక్తులు నిద్ర చేసే మహా మండపంలోని 1, 2వ అంతస్తులలో ఈ ప్రసాద వితరణ జరిగితే అమ్మవారి ప్రసాదం అందరికీ అందుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు ఈ మార్పులు చేస్తారని భక్తులు భావిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు