మురికి కూపాల్లో జనావాసాలు

2 Aug, 2016 00:02 IST|Sakshi
 • ఇండ్ల మధ్యలో నిలుస్తున్న మురుగునీరు
 • చిత్తడవుతున్న అంతర్గత రోడ్లు
 • ప్రబలుతున్న వ్యాధులు
 • పట్టించుకోని అధికారులు
 • దిలావర్‌పూర్‌ : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. 70శాతానికి పైగా ప్రజలు పల్లెలోనే జీవనం సాగిస్తున్నారు. అందుకే గాంధీజీ పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్నాడు. కానీ ప్రస్తుతం పల్లెలను పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయాడు. కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధే ధ్యేయం అంటూ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నేతలు, అధికారులు పల్లె ముఖం చూడడం లేదు. ఇందుకు తార్కాణమే మండల కేంద్రమైన దిలావర్‌పూర్‌ గ్రామం.
  దిలావర్‌పూర్‌ గ్రామంలో ప్రస్తుతం గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 
  గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే వ్యాధులు ప్రబలుతాయి అని జిల్లా అధికారులు తరచూ పేర్కొనే మాటలివి. వాస్తవానికి గ్రామంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డ్రై నేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు ఇండ్ల మధ్యలో ప్రవహించి అంతర్గత రోడ్లపైకి వస్తోంది. దీంతో రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలు ఇండ్లలోంచి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందుల పాలవుతున్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన స్థానిక పంచాయతీ పాలకవర్గం, అధికారులు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. సాక్షాత్తు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లోని ఇండ్ల మధ్య మురుగునీరు ప్రవహించి ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో తీవ్ర దుర్గందంతో పాటు దోమల వ్యాప్తి అధికంగా ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే పలు వార్డుల్లో సైతం అంతర్గత రోడ్లు డ్రై నేజీలు లేని కారణంగా కురుస్తున్న వర్షాలకు జనావాసాలన్నీ కంపుకొడున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుత వర్షా కాలంలో తాము ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 
  ఆసుపత్రుల పాలవుతున్నాం
  గామ్‌ గంగారాం, దిలావర్‌పూర్‌
  తమ కాలనీలో అనేక రోజులుగా తీవ్ర సమస్యలు పడుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. మా ఇండ్ల మధ్య మురుగునీరంతా ఒకచోటికి చేరి తీవ్ర దుర్గందం వ్యాపిస్తోంది. దోమలు, ఈగల బెడదతో నిత్యం ఇబ్బందులు పడుతూ జ్వరాల బారిన పడుతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలి. 
  రోడ్లు బురదగా మారుతున్నాయి
  – ఖలీం, దిలావర్‌పూర్‌
  గ్రామంలో డ్రెయినేజీలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు ప్రవహించి రోడ్లన్నీ బురదగా మారుతున్నాయి. నీరు నిలిచి ఉండడంతో దోమలు, ఈగలు అధికమయ్యాయి. దీంతో ఇండ్లలో నివసించాలంటేనే ఇబ్బందిగా ఉంది. పలుమార్లు పంచాయతీ వారికి తమగోడును విన్నవించినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
  దోమలతో వేగలేకపోతున్నం
  – చాతిరి లక్ష్మి, దిలావర్‌పూర్‌
  రోడ్లు, మురుగు కాలువలు అధ్వానంగా ఉండడంతో రోజూ ఇబ్బందుల పాలవుతున్నం. నాలుగు రోజులగా వర్షం పడుతోంది. దీంతో నీరు అంతా రోడ్లపైకి రావడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. సర్కారోళ్లు ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకుని రోగాల బారిన పడకుండా చూడాలి.
  చర్యలు చేపడతాం....
  – సరస్వతి, కార్యనిర్వహణాధికారిణి, దిలావర్‌పూర్‌
  గ్రామ శివారు కాలనీలతో పాటు గ్రామంలోని కొన్ని వార్డుల్లో రోడ్లు బురదమయంగా ఉన్న మాట వాస్తవం. పరిస్థితి జఠిలంగా ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి మురుగునీరు నిలువ ఉండకుండా చేసి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడతాం. అలాగే ఇండ్ల మధ్యలో ఉన్న గుంతలను పూడ్చి నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపడతాం. నూతనంగా రోడ్లనిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణాన్ని సైతం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగిస్తాం.
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా