జోరువాన

26 Aug, 2017 23:12 IST|Sakshi
జోరువాన
- జిల్లాలో విస్తారంగా వర్షాలు
- అవుకు, చాగలమర్రిలో భారీ వర్షం
- పొంగిన చెరువులు, కుంటలు, వాగులు వంకలు
- పలు మండలాల్లో గణేష్‌ నిమజ్జనానికి తొలగిన అడ్డంకులు
  
కర్నూలు (అగ్రికల్చర్‌): ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. వర్షాకాలం మొదలైన 85 రోజుల తర్వాత జిల్లాలో కుంభవృష్టి కురిసింది. ఆగస్టు నెల మొదటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతూ ఈ నెల 24వ తేదీ(గురువారం) రాత్రి జిల్లాలోని వివిధ మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఒకే రోజు 24.6 మి.మీ. వర్షపాతం నమోదు కావడం విశేషం. వివిధ మండలాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో గణేష్‌ నిమజ్జనానికి నీటి సమస్య తీరింది. అత్యధికంగా అవుకులో రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్లకు (200.2మి.మీ.) పైగా వర్షపాతం నమోదైంది. గత దశాబ్దకాలంలో ఇంతటి భారీగా వర్షపాతం నమోదు కాలేదు. నంద్యాల డివిజన్‌లోని అవుకు, చాగలమర్రి, ఉయ్యలవాడ, మహనంది, ఆళ్లగడ్డ తదితర మండలాల్లో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చాగలమర్రిలో కురిసిన కుంభవృష్టితో కుందూ, వక్కిలేరుతో సహా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. అతి భారీ వర్షాలతో చాగలమర్రి, అవుకు తదితర ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు నీట మునిగాయి. బండి అత్మకూరు మండలం సంతజూటూరులో కురిసిన భారీ వర్షానికి మట్టి ఇళ్లు కూలిపోయింది. ఈ సంఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి.
 
గురువారం రాత్రి తుగ్గలి, ఆస్పరి మండలాలు మినహా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి బేతంచెర్ల, మిడుతూరు, వెల్దుర్తి మండలాల్లో మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురుశాయి. నంద్యాల డివిజన్‌తో పోలిస్తే కర్నూలు, ఆదోని డివిజన్‌లో అంతటి భారీ వర్షాలు లేవు. కర్నూలు, ఆదోని డివిజన్‌లలో మాత్రం అతి భారీ వర్షాలు లేకపోయినా పంటలకు మాత్రం మేలు చేశాయి. మొత్తంగా జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షాలు పడటం రైతులకు ఊరట నిస్తోంది. జూలై నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 123.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
 
శుక్రవారం రాత్రి కురిసిన వర్షాల వివరాలు
మండలం      నమోదైన వర్షపాతం (మీ.మీ)
 
హొళగొంద           41.2
హాలహర్వి            32.8
ఆదోని                 28.0
ఆలూరు              25.0
ఆస్పరి                22.0
కోసిగి                 21.2
చిప్పగిరి              21.0    
మరిన్ని వార్తలు