అప్పులోనూ అడ్డంగా దోపిడీ

10 Dec, 2016 00:24 IST|Sakshi
అప్పులోనూ అడ్డంగా దోపిడీ

– కొందరు రేషన్‌ డీలర్ల  చేతివాటం
– ఇవ్వని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు
– వాటి మొత్తాన్ని రసీదులో చూపిస్తున్న వైనం
– వచ్చే నెల లబ్ధిదారుని ఖాతాల్లో ఈ మొత్తం బదిలీ

--------------------------------------------------------------
అనంతపురంలో నివాసముంటున్న కె.రమణ తన కార్డు తీసుకుని రేషన్‌ షాపునకు వెళ్లాడు. 15 కేజీ బియ్యం(రూ.15), అర కేజీ చక్కెర(రూ.8) ఇచ్చారు. వాటికి రూ.23 అవుతుంది. అయితే డీలర్‌ మాత్రం వీటితో పాటు కిలో గోధుమ పిండి (రూ.16.50), లీటరు కిరోసిన్‌ (రూ.19) కూడా ఇచ్చినట్లు ఈ–పాస్‌లో వేలిముద్ర వేయించుకున్నాడు. అన్ని సరుకులకు కలిపి రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. తనకు రెండు సరుకులు ఇచ్చి నాలుగు సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇవ్వడంతో రమణ కంగుతిన్నాడు. వెంటనే డీలర్లని ప్రశ్నిస్తే.. రెండ్రోజుల్లో మిగిలిన సరుకులు ఇస్తామంటూ పంపి వేశాడు.

ఇది ఒక్క రమణ సమస్యే కాదు.. తెల్లకార్డు కలిగిన లబ్ధిదారులందరిదీ. డీలర్ల అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే.
              
------------------------------------------------------------
చౌక దుకాణాల్లో జరిగే అక్రమాలు అరికట్టాలని, డీలర్ల అవినీతికి చెక్‌ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా డీలర్లు ఏదో ఒక దారి వెతుక్కుంటూనే ఉన్నారు. తమకు అడ్డు లేదని నిరూపిస్తున్నారు. తెల్లకార్డుదారుల సొమ్మును అడ్డంగా దోచుకుంటూ దొరల్లా చెలమణి అవుతున్నారు.

అప్పుగా సరుకులు ఇమ్మంటే...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కార్డుదారులకు డిసెంబర్‌ నెల సరుకులు అప్పుగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీన్ని కొందరు డీలర్లు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. తమ  తెలివి తేటలతో చేతివాటం ప్రదర్శిస్తూ, కార్డుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.  సరుకులను అప్పుగా ఇస్తూ... అందలోనూ దోపిడీకి తెరతీయడం అందరూ విస్తుపోయేలా చేస్తోంది. ఇదే అంశం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది.

అదెలాగంటే...
ఎన్ని సరుకులు ఇస్తే అన్నింటికే ఈ-పాస్‌లో వేలిముద్ర వేయించుకోవాలి. ఇది నిబంధన. అయితే అందుకు విరుద్ధంగా కొందరు డీలర్లు తమ అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. రెండు సరుకులు ఇచ్చేసి అన్ని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ–పాస్‌లో ఇచ్చినట్లుగా ఉంది కాబట్టి సరుకులు కార్డుదారుని చేరినట్లు ఆన్‌లైన్‌లో నమోదవుతుంది.

దోపిడీ జరిగే తీరు ఇలా..
గత నెల వరకు ఇచ్చిన సరుకులకే కార్డుదారులు డబ్బులు ఇచ్చేవారు. ప్రస్తుత నెలలో సరుకులను అప్పుగా డీలర్లు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని వచ్చె నెలలో ఇచ్చే సరుకుల మొత్తాన్ని కలసి కార్డుదారుని ఖాతా నుంచి తమ ఖాతాకు బదిలీ చేసుకుంటారు. రమణ విషయం తీసుకుంటే అతనికి ఇచ్చిన సరుకులు రెండు. అందుకు అయిన మొత్తం రూ.23. అయితే నాలుగు సరుకులు ఇచ్చినట్లుగా రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. అంటే వచ్చే నెలలో ఈ మొత్తం రమణ ఖాతా నుంచి డీలర్‌ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇక్కడ ఇవ్వని సరుకులు గోధుమ పిండి(రూ.16.50), కిరోసిన్‌(రూ.19). మొత్తం రూ.25.50 పైసలు డీలర్‌ సునాయసంగా నొక్కేస్తున్నాడనేది స్పష్టమవుతోంది.

అనంతపురం ఆర్డీఓ మలోల ఏమంటున్నారంటే...
కార్డుదారునికి ఇచ్చిన సరుకులకు మాత్రమే డీలర్‌ రసీదు ఇవ్వాలి. ఇవ్వని సరుకులు కూడా ఇచ్చినట్లుగా నమోదు చేయడం నేరం. అలా ఎవరైనా డీలరు అధికంగా వసూలు చేస్తున్నా, ఇవ్వని సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇస్తుంటే వెంటనే మా దృష్టికి లేదా తహశీల్దారు దృష్టికైనా తీసుకువస్తే సదరు డీలర్‌పై చర్యలు తీసుకుంటాం. 

మరిన్ని వార్తలు