బట్టలుతకలేదని రేషన్‌ కట్‌!

8 Oct, 2016 09:19 IST|Sakshi
వేదింపులకు గురవుతున్న పణుకువలస రజకులు
ఎక్కువవుతున్న గ్రామపెద్దల వేధింపులు
నీరు, కరెంటు నిలుపుదల చేస్తామని హెచ్చరికలు
పణుకువలస రజకుల ఆక్రందనలు
 
బలిజిపేట రూరల్‌(విజయనగరం): వారంతా కాయకష్టం చేసి ఇన్నాళ్లూ బతికారు. పెత్తందార్ల ఇళ్లల్లో బట్టలుతికి... వారు చెప్పిన పనులు చేసి... వారిచ్చింది తీసుకుని కాలం గడిపారు. వయసుడిగిన వేళ పనులు మానుకున్నారు. అందివచ్చిన పిల్లలు మెరుగైన జీవనంకోసం వేరే పనులు చూసుకున్నారు. అది భరించలేని ఆ వూరి పెద్దలు వేధింపులు మొదలుపెట్టారు. ఆ కుటుంబాలకు రేషన్‌ కట్‌చేశారు. ఇంకా విద్యుత్, నీటిసరఫరా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. గిట్టుబాటు కాని కులవత్తి చేయనందుకు మండలంలోని పణుకువలసలోని రజకులను ఆ గ్రామ పెద్దలు వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఏడుకుటుంబాల రజకులు ఉండగా వారిలో 5 కుటుంబాల వారు గిట్టుబాటు కావట్లేదని గత కొద్ది కాలంగా కులవత్తికి దూరమయ్యారు. వీరిలో పెంట అప్పలస్వామి వయోభారంతో వత్తి పనికి దూరమవ్వగా... ఆయన కుమారులైన సింహాచలం, గౌరి వేర్వేరుగానే ఉంటున్నారు. వారిద్దరూ వత్తి మానేసి ఆటో నడుపుకుంటున్నారు. అప్పలస్వామి మరో కుమారుడు రాము వలస వెళ్లిపోయాడు. వీరుగాకుండా ఎన్‌.సీతయ్య, ఎం.తవిటిశెట్టి కుటుంబాలు స్థానికంగానే ఉంటున్నా... కులవత్తివల్ల గిట్టుబాటు లేక వేరే పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

దీనిని సహించలేని గ్రామ పెద్దలు ఎం.సూర్యనారాయణ, బి.సింహాచలం, వాసు, జి.అప్పలనాయుడు తమను రెండు నెలలుగా ఒత్తిడి చేస్తూ మానేసినందుకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారంతా వాపోయారు. వృత్తి పని మానేయడం ఏమిటనీ.. అలా అయితే గ్రామంలో ఉండనీయమని, నివాస గహాలను ఖాళీచేయించి వేరేవారికి ఇచ్చి తమను గ్రామ బహిష్కరణ చేస్తామని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ సరకులు ఇవ్వనీయకుండా డీలర్‌ను కట్టడి చేశారనీ, ఇళ్ళకు నీటిని, విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. వేధింపుల్లో భాగంగా వికలాంగుడైన రాముకు వచ్చే పింఛన్‌ రూ. 1500లు నిలుపుదల చేయించారని వారు పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్‌ బి.వి.లక్ష్మి, ఎస్‌ఐ సింహాచలానికి ఫిర్యాదు చేసినట్టు వివరించారు.
 
కడుపునిండకే – సింహాచలమమ్మ, పణుకువలస.
 
వత్తిపనితో కడుపునిండడంలేదు. ఇన్నాళ్లు ఎలాగోలా బతికాం. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారు వేరే మార్గం చూసుకుంటున్నారు. మాకు రెక్క ఆడేవరకు పెద్దవారి పనులు చేశాం. శక్తిలేకే వదిలేశాం.
 
ఎన్ని బాధలు పెట్టినా భరించాం– పి.అప్పలస్వామి, పణుకువలస.
వత్తి పనికి కట్టుబడి, గ్రామాన్ని వదిలి వెళ్ళలేక వయస్సు మీరినా గ్రామ పెద్దలకు ఎన్నో సేవలు చేశాం. పెద్దలు కొట్టినా, తిట్టినా, మా కడుపుమండినా ఇంతవరకు పనులు చేశాం. పిల్లలకు రెక్కలు వచ్చాయి వారు ఎగిరిపోయారు.  మేం పనులు మానేస్తే వేధిస్తారా?
 
గ్రామ పెద్దలు ఇవ్వొవద్దన్నారు– శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్‌ డీలర్‌
 
రజకులకు కార్డులు ఉన్నాయి. వారికి రేషన్‌ వచ్చింది. గ్రామంలో పెద్దలకు వారికి వివాదాలు ఉండడంతో వారు ఇవ్వొద్దని చెప్పడంతో రేషన్‌ ఇవ్వలేదు.  
 
సరుకులు ఇప్పిస్తా –బి.వి.లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట
 
గ్రామంలో తగాదాలకు రేషన్‌ ఆపివేయడానికి ఎటువంటి సంబంధం లేదు.  వారి సరుకులు వారికి ఇప్పిస్తాం. వెంటనే డీలరుకు చెప్తాం. 
 
 
మరిన్ని వార్తలు