మేలైన వంగడాల కోసం కృషి

17 Sep, 2016 21:27 IST|Sakshi
మార్టేరు (పెనుమంట్ర): అధిక దిగుబడినిచ్చే మేలైన రకాల వంగడాలు మరిన్ని సృష్టించడానికి శాస్త్రవేత్తల కృషి అవిరామంగా కొనసాగుతూనే ఉందని ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం వైస్‌ చానల్సర్‌ డాక్టర్‌ టి.విజయకుమార్‌ అన్నారు. ఇందుకు మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం చక్కని వేదికగా ఉపకరిస్తోందని చెప్పారు. మార్టేరు వరి పరిశోధనా స్థానంలో శనివారం జరిగిన ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఎంపీ, పాలకవర్గ సభ్యుడు కె.రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ రైతుకు లాభసాటి సాగు అనిపించేలా యాజమాన్య పద్ధతుల్లో నూతన ఒరబడిని తీసుకురావాలని శాస్త్రవేత్తలకు సూచించారు. విజయనగరం ఎమ్మెల్యే, పాలక మండలి సభ్యురాలు మీసాల గీత మాట్లాడుతూ వ్యవసాయంపై యువత ఆకర్షితులయ్యేలా కళాశాలల్లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇవ్వాలని సూచించారు. కొవ్వూరు ఎమ్మెల్యే, పాలకమండలి సభ్యుడు కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ రైతుల అనుభవానికి శాస్త్రవేత్తల విజ్ఞానం తోడు కావాలన్నారు. స్థానికంగా విడుదల చేసిన శ్రీధతి, తరంగిణి, భీమ తదితర విత్తనాల గుణగణాలను మార్టేరు పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ పీవీ సత్యనారాయణ వివరించారు. ఎన్‌ఏఏఆర్‌ఎం డైరెక్టర్‌ డి.రామారావు, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి వై.రామకృష్ణ, డాక్టర్‌ వి.దామోదర్‌నాయుడు, ప్రొఫెసర్లు జీవీ నాగేశ్వరరావు, ఐ.భవానీదేవి, ఎస్‌ఆర్‌ కోటేశ్వరరావు, మేకల లక్ష్మీనారాయణ మాట్లాడారు.అనంతరం పాలక మండలి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని వీసీ విజయ్‌కుమార్‌  ప్రారంభించారు.
 
క్షేత్రస్థాయి పరిశీలన
ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే జవహర్‌ సంస్థ ప్రాంగణంలోని వరినాట్ల ప్రదర్శనలను తిలకించారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టిన వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఎంపీ అభినందించారు.  ముందుగా ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్వాగతం పలికారు. 
 
మరిన్ని వార్తలు