పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

15 Sep, 2016 00:29 IST|Sakshi
  • డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా
  • విద్యారణ్యపురి: నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌)ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కువద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి. లింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు ఉద్యోగులకు ఒక సామాజిక భద్రతగా పాతపెన్షన్‌ విధానం ఉండేదన్నారు.అయితే నూతన పెన్షన్‌ విధానం (సీపీఎస్‌)తో ఉద్యోగ విరమణ పొందిన కుటుంబానికి సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు.
     
    దేశంలో మిగులు బడ్జెట్‌ కలిగిన ధనిక రాష్ట్రంగా చెపుతున్న తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే వరకు తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు సంఘటితంగా పోరాడుతామన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్‌ ఎం గంగాధార్‌ మాట్లాడుతూ ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణతో  ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు ఉద్యోగులు ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఎస్ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి మాట్లాడుతూ సీపీఎస్‌ విధానంలో పెన్షన్‌ ,గ్రాట్యూటీ, జీపీఎఫ్‌ వంటివి  నష్టపోవాల్సి వస్తుందన్నారు. టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి వెంకటరెడ్డి , టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు  అశోక్‌ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి రాంచందర్‌, జనరల్‌ సెక్రటరీ టి.సుధర్శనం నాయకులు జి ఉప్పలయ్య, పి.సుధర్శన్‌రెడ్డి, బి. జాన్‌నాయక్‌, డి. మహేందర్‌రెడ్డి, ఎ. గోవిందరావు, కె. కొమ్మాలు, డి.కుమారస్వామి, జి. శ్రీనివాస్‌రెడ్డి, బి. రాములు, జి. ఆదిరెడ్డి, జి.సురేందర్‌ పాల్గొన్నారు.
     
     
>
మరిన్ని వార్తలు