అద్దె అదిరే... కమిషనరేట్లు బెదిరే!

10 Jun, 2016 00:33 IST|Sakshi

అద్దెల భారంతో నగర శివారులకు..
ప్రసాదంపాడులో 30 వేల చదరపు
అడుగుల్లో ఎక్సైజ్ కమిషనరేట్
ఆర్టీసీ హౌస్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ
అద్దెలతో సతమతమవుతున్న రాష్ట్ర కార్యాలయాలు
 

సాక్షి, విజయవాడ :  జూన్ 27 కల్లా నవ్యాంధ్రకు రావాలని సీఎం ఆదేశాలు.. మరో వైపు భయపెట్టే అద్దెలతో రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటు సమస్యాత్మకంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెకు నగరంలో భవనాలు దొరక్కపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల అన్వేషణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. కొన్ని శాఖలు దూరప్రాంతమైనా పర్వాలేదనే రీతిలో నగర శివారు ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగులకు రవాణాపరంగా కొంత ఇబ్బందైనా ముందు భవనం దొరికితే చాలు అనే రీతిలో వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనరేట్, డెరైక్టరేట్ కార్యాలయాలు నగర శివారు గ్రామం ప్రసాదంపాడులో ఏర్పాటు కాగా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ఆర్టీసీ హౌస్‌లో ఏర్పాటవుతోంది.


విజయవాడలో అద్దె భవనాల అన్వేషణ ప్రభుత్వ అధికారులకు తలనొప్పిగా మారింది. చదరపు అడుగకు ప్రభుత్వం రూ.16 ధర నిర్ణయించింది. విజయవాడలోని బందరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో భవనాలు తక్కువ అద్దెకు దొరికే పరిస్థితి లేదు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చదరపు అడుగుకు నెల అద్దె సగటున రూ.40 నుంచి రూ.100 వరకు ఉంది. బందరు రోడ్డు, బెంజ్ సర్కిల్‌లో రూ.100 వరకు ఉండగా మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య భవనాల అద్దె రూ.40 పైమాటగానే ఉంది. ఈ క్రమంలో రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇలా అనేక విభాగాలకు అద్దె భవనాల కోసం 20 రోజులుగా నిరంతర అన్వేషణ సాగుతోంది.

ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఇతర అధికారులు అపార్ట్‌మెంట్‌ను పరిశీలించి యజమానులతో మాట్లాడుకొని అద్దెను ఖరారు చేసి ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 25 నుంచి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం, డెరైక్టరేట్ కార్యాలయం ఇక్కడ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఎక్సైజ్ శాఖకు విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో సుమారు 500 గజాల స్థలం ఉంది. దానిలో గతంలో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి మరీ పునాదులు వేశారు. ఆ తర్వాత మళ్లీ పనులు ముందుకు సాగలేదు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా దానిలో భవనం నిర్మిస్తామని ప్రకటించినా అది ఆచరణలోకి రాకపోవటంతో శివారు గ్రామంలో అద్దె భవనానికి వెళ్లాల్సివస్తోంది.


ఆర్టీసీ హౌస్‌లో రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయం
పండిట్ నెహ్రు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ఆర్టీసీ హౌస్‌లో ఒక ఫ్లోర్‌ను రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి కేటాయించారు. ఆర్టీసీ కార్పొరేషన్ కావటంతో చదరపు అడుగుకు రూ.16 అద్దె నిర్ణయించింది. ఆ మేరకు అద్దె చెల్లించి రవాణా శాఖ కార్యాలయం ఇక్కడ ప్రారంభం కానుంది. ఆర్టీసీ హౌస్‌లో ఇతర విభాగాలు తమకు కేటాయించాలని కోరుతుండటంతో రవాణా శాఖ దీనిని ఖరారు చేసుకొని గురువారం ఉదయం కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం కార్యాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 27 కల్లా 80 మంది ఉద్యోగులతో విజయవాడ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్ట నున్నారు.

మరిన్ని వార్తలు