కుట్లు తెగుతున్నాయ్!

1 Jun, 2016 07:48 IST|Sakshi
కుట్లు తెగుతున్నాయ్!

తిరుపతి కార్పొరేషన్:  తిరుపతి రుయా ఆస్పత్రి సేవలు పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా మారాయి. సాక్షాత్తు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న ఈ ఆస్పత్రి అభివృద్ధి రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. ఆస్పత్రి ఆవరణలో అంతర్గతంగా ఉన్న రోడ్లు దుస్థితికి చేరాయి. వీటిని బాగు చేయాల్సిన అధికారులు, పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

 
నరకమే!

రుయాలోని కొత్త మార్చురీ సమీపంలో ఆర్థో విభాగం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలై, కాళ్లు, చేతులు విరిగిపోయిన రోగులకు ఈ విభాగంలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. అనంతరం రోగులను స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి అక్కడి నుంచి ఆరోగ్య శ్రీ వార్డుకు తరలిస్తారు. ఆర్థో విభాగం నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆ వార్డుకు స్ట్రెచర్‌పై వెళ్లాలంటే నరకమే. ఈ మార్గంలోని తారు రోడ్డు పెచ్చులూడి, రాళ్లు గుంతలమయమైంది. పైగా ఈమార్గంలో వాహనాల రాకపోకలతో రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. ఇదే మార్గంలో స్ట్రెచ్చర్‌పై రోగిని వార్డుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. గుంతలు, రాళ్లపై వెళ్లే టప్పుడు రో గిపడుతున్న బాధ అంతాఇంతా కాదు. కానీ సిబ్బంది ఇవేవీ పట్టించుకోవడంలేదు. రయ్..రయ్ మంటూ లాక్కొచ్చేస్తున్నారు. ఎముకుల ఆపరేషన్ చేసుకున్న రోగులు నొప్పితో తల్లడిల్లిపోతున్నారు. ‘కొంతసేపు ఓపికపట్టు..’ అంటూ సిబ్బంది సముదాయించి తీసుకెళ్లాల్సి వస్తోంది. గుంతల్లో అదురుకు కొన్ని సందర్భా ల్లో జాయింట్లు పక్కకు జరిగిపోతున్నాయని, దీంతో తిరిగి మరో సారి ఆపరేషన్ చేయాల్సి వస్తోందని కొందరు రోగుల సహాయకులు చెబుతున్నారు.

 
నిధులు విడుదలైనా..

రోగులు పడుతున్న బాధలు చూసిన తిరుపతి ఎంపీ వరప్రసాద్ రోడ్డు ఏర్పాటుకు రెండేళ్ల క్రితం రూ.10 లక్షలు మంజూరు చేశారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్యవిద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ రుయా ఆస్పత్రిని వేర్వేరుగా తనిఖీ చేశారు. రోడ్డు పనులను త్వరగా చేపట్టాలని, ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ఇక్కడి సిబ్బందిని ఆదేశించారు. కానీ ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేరు.

 
కాంట్రాక్టర్లు ముందుకు రారట

రుయా ఆస్పత్రి అధికారుల మాటలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రుయాలో ఆర్థో నుంచి వచ్చే రోడ్డు, ఇతర రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు. వీటి మరమ్మతులకు ఎంపీ నిధుల నుంచి రూ.6 లక్ష లు మంజూరయ్యాయని, అయితే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురావడంలేదని సెల వివ్వడం గమనార్హం.

 

 

మరిన్ని వార్తలు