ఇదేమి ప్రజాస్వామ్యం?

7 Apr, 2017 23:36 IST|Sakshi
ఇదేమి ప్రజాస్వామ్యం?
- నడిబజారులో నవ్వులపాలు
- వైఎస్సార్‌సీపీ పిలుపునకు ప్రజా మద్ధతు
- సేవ్‌ డెమోక్రసీకి అనూహ్య స్పందన 
సాక్షి ప్రతినిధి, కాకినాడ :  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపునకు జిల్లాలో అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ రహితంగా నేతలు, విద్యార్థులు, మేధావి వర్గం నుంచి నిరసనకు మద్ధతు లభించింది. రామచంద్రపురం నియోజకవర్గం (ఇక్కడ స్థానిక ఎన్నికలున్నాయి) మినహాయిస్తే మిగిలిన 18 నియోజకవర్గాల్లో  సీఎం చంద్రబాబు అప్రజాస్వామికంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైఎస్సార్‌సీపీ ఆందోళనల్లో పాల్గొనడం కనిపించింది. పలు ప్రాంతాల్లో వామపక్షాల నేతలు, పార్టీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నిరసన గళాన్ని వినిపించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌లు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు, తహసీల్థార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు,  కొన్ని చోట్ల నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని, మరికొన్నిచోట్ల వెనక్కు నడుస్తూ, ఇంకొన్ని చోట్ల చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించమంటూ దివంగత నేత ఎన్టీఆర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి వినూత్న నిరసన తెలియచేశారు. అటు ఏజెన్సీలో సైతం గిరిజనులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాలుపంచుకోవడం కనిపించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లాను సమన్వయం చేసుకుంటూ సేవ్‌ డెమొక్రసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయించారు.
- సేవ్‌ డెమెక్రసీ పేరుతో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌తో కలిసి భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ, జాతీయ రహదారి దిగ్భంధనం, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా,  రెండు గంటలపాటు రాస్తారోకో చేసి భారీ మోటారు సైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి,ప్రచారసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, జిన్నూరి బాబి తదితరులు పాల్గొన్నారు.
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చంద్రబాబు తీరుతో  మేధావులు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు జోక్యం చేసుకోవాలని కొత్తపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే కాకుండా టీడీపీలో సమర్ధులు లేనట్టు మంత్రి పదవులను ఇచ్చి రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహస్యం చేశారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. తుని శాంతినగర్లోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్ధార్‌  కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 
- రంపచోడవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజకవర్గనేత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ (బాబు) ఆధ్వర్యంలో నాయకులు , కార్యకర్తలు, భారీ ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్‌ సెంటర్‌లో  రాజమండ్రి–భద్రాచలం  ప్రధాన రహదారిపై  బైఠాయించి నిరసన తెలిపారు. రఘుదేవపురం నుంచి సీతానగరం వరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా,  సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రతో నిరసన తెలియచేశారు. పాదయాత్ర ఆద్యంతం ‘సేవ్‌ డెమోక్రసీ నినాదాలతో  మారుమోగింది. అనంతరం సీతానగరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 
- అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, బొమ్ము ఇజ్రాయిల్, బీసీ, విద్యార్థి విభాగాల అధ్యక్షులు మట్టపర్తి మురళీకృష్ణ, జక్కంపూడి కిరణ్‌ తదితరులు ఆందోళన నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీలో కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు తదితర నేతల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కడియం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, రూరల్‌ కో–ఆర్డిటర్‌ గిరాజాల బాబు, రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు నేతలు భారీ ధర్నా, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని, వెనక్కు నడుస్తూ నిరసన తెలియచేశారు. కో–ఆర్డినేటర్‌ పర్వత శ్రీపూర్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పెయ్య చిట్టిబాబు తదితరులు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
- పి.గన్నవరంలో కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండుగుదిటి మోహన్‌ తదితరులు భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పి.గన్నవరం సెంటర్‌లోæ చిట్టిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రాజోలు కో–ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సఖినేటిపల్లి రేవు నుంచి రాజోలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండపేటలో కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ పట్టాభిరామయ్య, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రా«ధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కరాచీ సెంటర్‌లో బాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ  ఎన్టీఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
- పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిల్‌ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనపర్తి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కాకినాడ సిటీ గాంధీనగర్‌ నుంచి బైక్‌ర్యాలీని సిటీ కో–ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ ప్రారంభించగా నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్‌ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండేపల్లి బాబి తదితరులు పిఠాపురంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించి పార్టీ కార్యాలయం నుంచి మోటారు సైకిళ్లపై ప్రదర్శన నిర్వహించి ఉప్పాడ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. కో–ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జగ్గంపేట సెంటర్‌లో వైఎస్‌ విగ్రహానికి పూల మాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 
 
మరిన్ని వార్తలు