సీరియల్ కిల్లర్ అరెస్ట్

10 Nov, 2015 09:15 IST|Sakshi
సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఏలూరు : వరుస హత్యలకు పాల్పడిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన చిన్నబత్తిన కరుణాకర్ తన భార్య, కుమారుడితో పాటు మరో ఇద్దరు మహిళలను హత్య చేశాడు. ఈనెల 1న జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం సమీపంలో తన కుమారుడు విజయ్‌కుమార్ (14)ను చంపిన కరుణాకర్ ఆ బాలుడి మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు.

అతణ్ణి అరెస్ట్ చేసి విచారించగా, గతంలో చేసిన మరో మూడు హత్యలు వెలుగు చూశాయని ఎస్పీ చెప్పారు. తన భార్య నీలిమ వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో కరుణాకర్ 2010 లో ఆమెను హైదరాబాద్‌లో తాను నివాసముండే ఇంట్లోనే హత్య చేశాడని తెలిపారు. ఆమెది హఠాన్మరణంగా అక్కడి వారిని నమ్మించి కేసు లేకుండా తప్పించుకున్నాడన్నారు. అనంతరం తన ఇద్దరు కుమారులు విజయ్‌కుమార్, అజయ్‌కుమార్‌లతో రాజమండ్రి వచ్చి నివాసం ఉంటున్నాడు. ‘రాజమండ్రికి చెందిన సోనీ, పార్వతి అనే ఇద్దరు మహిళలతో కరుణాకర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఇదిలావుండగా సోనీ అనే మహిళ తన పెద్ద కొడుకు విజయ్‌కుమార్‌తో సంబంధం పెట్టుకుందని అనుమానించి ఆమెను రాజానగరం సమీపంలో హత్యచేశాడు. ఈ హత్య విషయాన్ని అతడి పెద్దకొడుకు విజయ్‌కుమార్..పార్వతికి చెప్పాడు. దీంతో ఆమె కరుణాకర్‌ను నిలదీసింది.

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దన్న కరుణాకర్ ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. నెలలు గడిచిపోతున్నా నిందితుడు పెళ్లిమాట ఎత్తక పోవడంతో పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.  దీంతో పార్వతిని గత నెల 13న సోనీని హత్య చేసిన చోటకు తీసుకెళ్లి హతమార్చాడు. విషయాలన్నీ తెలిసిన పెద్దకొడుకు విజయ్‌కుమార్ వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదనే ఉద్దేశంతో అతడిని చంపి దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద కాలువలో పడేశాడు. కొవ్వూరు రూరల్ సీఐ సుబ్బారావు ఆదివారం దేవరపల్లి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితుడు కరుణాకర్ పట్టబడ్డాడని’ ఎస్పీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు