ఇంత అఘాయిత్యమా? | Sakshi
Sakshi News home page

ఇంత అఘాయిత్యమా?

Published Tue, Nov 10 2015 9:21 AM

ఇంత అఘాయిత్యమా? - Sakshi

పార్లమెంట్‌లో ఏం జరిగింది -9
 
 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 18.02.14 నాటి లోక్‌సభ సమావేశ వివరాల కొనసాగింపు...
 క్లాజ్ 49
 స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, మీ 48వ సవరణ, క్లాజ్ 49కి సంబంధించి, ప్రతిపాదిస్తున్నారా?
 ఒవైసీ: పేజీ 12లో 11-29 వరకు లైన్లు సవరించ ప్రార్థన.
 (ఆ లైన్లలో ఏముందో ఏమని సవరించాలో ఇచ్చిన వాక్యాలు 16 లైన్లు ఉన్నాయి. దీని తర్వాత ఒవైసీ క్లుప్తంగా సవరణ ఉద్దేశం వివరించారు. అందుకని ఈ 16 లైన్లు ఇక్కడ అనువదించి మీకందివ్వటం లేదు.

క్లుప్తంగా నన్ను వివరించనివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు హైద్రాబాద్ రాష్ట్రముండేది. హైద్రాబాద్ హవుస్ అనే 8.79 ఎకరాలలో ఉన్న అత్యద్భుతమైన భవనాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది. ఈ హవుస్ తీసు కున్నందుకు ప్రత్యామ్నాయంగా హైద్రాబాద్ రాష్ట్రానికి 19 ఎకరాల భూమినిచ్చింది. ఇప్పటి ఈ బిల్లు ప్రకారం - ఏపీ భవన్, పక్కనున్న బహామ్ హవుస్ ఆంధ్రప్రదేశ్‌కు చెందు తాయి. ఇది తెలంగాణకు చేస్తున్న అన్యాయం కాదా? తెలం గాణా గొంతుకలు ఏమైపోయాయి? తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి, మీరిక్కడ నోరెత్తకుండా, తీవ్ర మైన అన్యాయం చేస్తున్నారు. కొంత మంది ముఖ్యమం త్రులవుదామనుకుంటున్న కాంగ్రెస్ వారు తెలంగాణా ఆస్తుల్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు.

 స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ 48వ సవరణ ఓటింగ్ కోరుతూ సభ ముందుంచుతున్నాను.
 ఒవైసీ: తలలు లెక్క పెట్టండి. ప్రపంచానికి తెలియాలి.
 సవరణ వీగిపోయింది.
 (ఇంక తలలు లెక్కపెట్టడం కూడా మానేశారు. ఇప్పటి దాకా కనీసం ఏవో లెక్క పెడుతున్నట్లు డ్రామా అన్నా చేశారు ఇప్పుడిక పూర్తిగా తెగించేశారు. అసలు లెక్కే పెట్టక పోతే, ఇక రాజ్యాంగానికి, చట్టసభలకీ, ప్రజాస్వామ్యానికీ అర్థముంటుందా?!)
 స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్
 క్లాజ్ 49 బిల్లులో భాగమవుతుంది.
 ప్రతిపాదన ఆమోదించబడింది.
 క్లాజ్ 49 బిల్లులో భాగమయ్యింది.
 క్లాజ్ 50 నుండి 54 వరకూ బిల్లులో భాగమయ్యాయి.
 క్లాజ్ 55

స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ క్లాజ్ 55కి మీ 49, 50 సవరణలు ప్రతిపాదిస్తున్నారా.

(ర్రాష్ట్రాల అప్పులు ఏవిధంగా పంచాలి అనే విషయమై ఒవైసీ సవరణలు 12 లైన్లు ఇక్కడ రాయటం లేదు. ఆయన వివరణ చదివితే అర్థమయిపోతుంది.)
ఇది చాలా అసమంజసం. జనాభాను బట్టి అప్పులెలా పంచుతారు? ఎక్కడ ఏ ప్రాజెక్టు వుందో దానిని బట్టి ఆ బకాయి ఆ రాష్ట్రానికి చెందాలి. అలా ప్రాజెక్టుల వారీగా అప్పు విడదీసిన తర్వాత, మిగిలిపోయిన రుణం రెండు రాష్ట్రాలకూ సమానంగా పంచాలి. ఈ విభజన చేసే పద్ధతే తప్పు. ఈ రుణాలు, అప్పులు ఎక్కడికెళతాయి? ఎవరు తీర్చాలి? ఇది తెలంగాణాకు అన్యాయం. ప్రభుత్వం ఈ క్లాజుకి ఎలా ఒప్పుకుంటోంది.

 తలలు లెక్క పెట్టమని మరొక్కసారి కోరుతున్నాను.
 స్పీకర్: ఒవైసీ గారి సవరణలు ఓటింగ్ నిమిత్తం సభ ముందుంచుతున్నాను.
 సవరణలు వీగిపోయాయి.
 ది క్వశ్చన్ ఈజ్.
 క్లాజ్ 55 బిల్లులో భాగమయ్యింది.
 క్లాజ్ 56 నుండి 59 వరకు బిల్లుకు కలపబడ్డాయి.
 (ఇంక తలలు లెక్క పెట్టడం కూడా ఆపేశారు. విసుగు చెందని విక్రమార్కుడి లాగా అసదుద్దీన్ ఒవైసీ మాత్రం సవరణలు ప్రతిపాదిస్తూనే వున్నారు.)
 క్లాజ్ 60 = పెన్షనర్లు ఏ ప్రాంతానికి చెందిన వారిని, నేటివిటీ బట్టి ఆ రాష్ట్రానికి చెందినవారుగా చూడాలని
 క్లాజ్ 76 = పదవ షెడ్యూల్‌లోని సంస్థల సౌకర్యాల విభజన గురించి
 క్లాజ్ 78 = సర్వీసెస్ ఆప్షన్ల గురించి
 క్లాజ్ 84 = స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి
 క్లాజ్ 91 = ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని
 షెడ్యూల్ 8  = సింగరేణి కాలరీస్ గురించి
 షెడ్యూల్ 11 = ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి
 షెడ్యూల్ 12 = తెలంగాణ విద్యుత్ లోటు గురించి
 షెడ్యూల్ 13 = ఎన్‌టీపీసీ గురించి

ప్లానింగ్ బోర్డులు, రీజినల్ బోర్డులు, హైద్రాబాద్ త్రాగునీరు, మెగాపవర్ ప్రాజెక్టులు, హైద్రాబాద్ ఓల్డ్ సిటీని వెనకబడ్డ ప్రాంతంగా గుర్తించాలని, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం, ముస్లిం రిజర్వేషన్లు, ఉర్దూను రెండవ అధికార భాష, మైనారిటీల సంక్షేమం, వెనుకబడ్డ వర్గాల వారి లోకల్ బాడీ రిజర్వేషన్లు, వక్ఫ్‌బోర్డు, ఉర్దూ అకాడమీ, షెడ్యూల్ క్యాస్ట్ మరియు ట్రైబ్స్ సబ్‌ప్లాన్, మైనార్టీ సబ్‌ప్లాన్... ఒవైసీ సవరణలన్నీ, కనీసం తలల లెక్క కూడా పెట్టకుండా ‘వీగిపోయాయని’ ప్రకటించేశారు.
 3 గంటల 24 నియొషాలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ 4 గంటల 24 నిమిషాలకు సభ వాయిదా పడటంతో ముగిసింది.

ప్రొ॥సౌగత్‌రాయ్ అనే బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు, హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కూడా సస్పెండ్ చేసేసి వుండుంటే 3 గంటల 36 నిమిషాలకే సభ ముగిసిపోయేది! నిజానికి ‘‘2 నుంచి 109 క్లాజుల వరకూ మొత్తం అన్ని షెడ్యూళ్ళు సభ ముందు ఓటింగ్‌కు ఉంచుతున్నాను - సభ ఆమోదించింది’’ అని స్పీకర్ ప్రకటించటానికి రెండు నిమిషాలు చాలు.. కొన్ని సవరణలు ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది కాబట్టి ఇంకో పది నిమిషాలు పట్టి ఉండేది!! ప్రజాస్వామ్య భారతదేశంలో, రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఏర్పాటు చేయబడిన తర్వాత, మొట్టమొదటిసారి, అత్యున్నత సభ అయిన ‘లోక్‌సభ’లో ఇంతటి అఘాయిత్యం జరిగింది. సభలో ఎంతమంది రాష్ట్ర విభజనను సమర్థించారో, ఎందరు వ్యతిరేకించారో కూడా తెలియదు.

సభలో ఎంత మంది సభ్యులున్నారు... నిజంగా ఓటింగ్ జరిగితే బిల్లు పాసవుతుందా... 13వ తారీఖున ‘పెప్పర్‌స్ప్రే’ ఘటన ఎందుకు జరిగివుంటుంది. ఆ వివరాలన్నీ విశ్లేషించే ముందు, పెద్దల సభ రాజ్యసభలో ఏం జరిగిందో, ఎవరేం మాట్లాడారో చూద్దాం.
 20-2-2015 నాడు రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు ఆపించలేదు. కాని గందరగోళంగా ఉన్న సభలో, ఎవరేం మాట్లాడుతున్నారో టీవీలో మనకు సరిగ్గా అర్థం కాలేదు!

మాట్లాడుతున్న సభ్యుడి ముందుండే మైకుతో చెవిలో పెట్టుకునే ‘ఇయర్‌ఫోన్’కు వుండే ‘కనెక్షన్’ వల్ల, రిపోర్టర్లకి ఇతర సభ్యులకీ, సభాపతి అనుమతితో మాట్లాడే వారి మాటలు స్పష్టంగా వినబడతాయి. సభాపతి అనుమతి ఇవ్వగానే, ఆ సభ్యుని ముందుండే మైక్ పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇక రాజ్యసభ ‘తంతు’ పరిశీలిద్దాం!
 
 -ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com

Advertisement
Advertisement