జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు శాలిగౌరారం విద్యార్థిని

7 Oct, 2016 22:46 IST|Sakshi
జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు శాలిగౌరారం విద్యార్థిని
శాలిగౌరారం : మండల కేంద్రానికి చెందిన షేక్‌ నస్రీన్‌ అనే విద్యార్థిని అండర్‌ –19 విభాగంలో జాతీయస్థాయి చెస్‌ పోటీలకు ఎంపికైంది. స్థానికంగా చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న షేక్‌ సయ్యద్‌ – జుబేదాల కూతురు నస్రీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తోంది. నస్రీన్‌ ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. దీంతో నస్రీన్‌ను అధికారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. నస్రీన్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో జాతీయ స్థాయికి ఎంపికైన నలుగిరిలో నస్రీన్‌ ఒకరు. నేటి నుంచి 18వ తేదీ వరకు ఏపీలోని రాజమండ్రిలో అఖిల భారత చెస్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగి జాతీయ స్థాయి చెస్‌ పోటీల్లో నస్రీన్‌ పాల్గొననుంది. జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు ఎంపికైన నస్రీన్‌ను చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించారు.
తమ్ముడూ చెస్‌ క్రీడాకారుడే...
నస్రీన్‌ తమ్ముడు షేక్‌ షరీఫ్‌పాషా కూడా చెస్‌ క్రీడాకారుడే కావడం గమనార్హం. షరీఫ్‌పాష గత నెల 17 నుంచి 19 వరకు రంగారెడ్డి జిల్లా నాగారంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకాన్ని సాధించాడు. దీంతో ఇతడు కూడా అండర్‌ – 19 విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
 
 
మరిన్ని వార్తలు