అన్యాయమో... రామచంద్రా!

2 May, 2017 01:55 IST|Sakshi
అన్యాయమో... రామచంద్రా!

సింహాచలంలో  ఈవో ఇష్టారాజ్యం
చందనోత్సవంలో సంప్రదాయాలకు తిలోదకాలు
ఘటాభిషేకానికి జీయర్లను ఆహ్వానించని వైనం


సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవంలో దొర్లిన తప్పులు ఈవో కె.రామచంద్రమోహన్‌ మెడకు చుట్టుకుంటున్నాయి.
మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చందనోత్సవ నిర్వహణ జరిగిందన్న వాదనలు
వెల్లువెత్తుతున్నాయి. ఆలయ ఆచార సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ కేవలం రాజకీయ  వీఐపీలకే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు హోరెత్తుతున్నాయి.


విశాఖపట్నం : ఏడాదికొక్క రోజు మాత్రమే నిజరూపదర్శనమిచ్చే స్వామి వారి చందనోత్సవానికి లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు. శనివారం నాటి చందనోత్సవానికి కూడా రెండు లక్షలమందికి పైగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు.  సామాన్య భక్తులను పక్కనపెట్టి వీఐపీలకే ప్రాధాన్యనమివ్వడం అన్ని దేవాలయాల్లోనూ ఓ తంతుగా మారినా.. సింహాచలంలో మాత్రం సంప్రదాయాలను సైతం పక్కనపెట్టి అధికారులు కేవలం వీఐపీల సేవలో తరించడం వివాదాస్పదమవుతోంది. శనివారం తెల్లవారుజామున అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు తొలిదర్శనం తర్వాత 2.45 గంటల నుంచి సామాన్యభక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతిచ్చారు. వాస్తవానికి ఈ సమయంలో వీఐపీలు, ప్రొటోకాల్‌ వీఐపీల దర్శనాలు చెల్లవు. వీరికి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. కానీ ఈసారి సామాన్య భక్తులకు నిర్దేశించిన వేళల్లోనూ వీఐపీలకు అనుమతినిచ్చారు. వీఐపీలతో పాటు వారి మందీమార్బలం పెద్దసంఖ్యలో రావడంతో సామాన్య భక్తులకు చుక్కలు కనిపించాయి. ఉచిత క్యూలైన్‌ భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో సింహగిరి బస్టాండ్‌ వరకూ లైన్‌ వచ్చింది. అక్కడ ఎటువంటి టెంట్లు లేకపోవడంతో  మండుటెండలో భక్తులు నరకం చవిచూడాల్సి వచ్చింది.

ఉచిత ప్రసాద వితరణ సంస్థల పట్ల అనుచిత వైఖరి
చందనోత్సవం నాడు స్వామి వారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎన్నో ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ప్రసాదం, అల్పాహారం అందిస్తుంటాయి. అయితే, ప్రసాద వితరణ నిమిత్తం ఆయా సంస్థలకు దేవాలయ ప్రాంగణాల్లో కనీస ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ట్రస్ట్, శ్రీ గోపాల్‌ బాబా చారిటబుల్‌ ట్రస్ట్‌. హరేకృష్ణ మూమెంట్‌ (అక్షయపాత్ర) సహా 34 ధార్మిక, సేవా సంస్థల ప్రతినిధులు కొండపైన వివిధ ప్రాంతాల్లో ఉచిత ప్రసాద వితరణ నిమిత్తం అనుమతి తీసుకున్నారు.

అలాగే కొండ కింద ప్రాంతాల్లో ప్రసాద వితరణ చేసేందుకు 21 సంస్థలు ముందుకొచ్చాయి. ఆయా సంస్థలకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు గాను అనుమతులు ఇచ్చేందుకే రోజుల తరబడి తిప్పిన దేవస్థానం అధికారులు చందనోత్సవం రోజు వారికి నరకం చూపించారు. సంస్థల ప్రతినిధులకు కనీసం టెంట్లు, కుర్చీలు కూడా ఇవ్వలేదు. ప్రసాదాలను కింద నుంచి కొండపైకి పైకి తీసుకువచ్చేందుకు వాహనాలకు చివరిక్షణం వరకు అనుమతినివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారని ఓ ధార్మిక సంస్థ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థ దశాబ్దాలుగా చందనోత్సవం నాడు కొండపై సేవలందిస్తోందని, ఎప్పుడూ ఇటువంటి ఇబ్బంది చూడలేదని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు