రేపటి నుంచి సిరిసిల్ల వస్త్రం కొనుగోళ్లు

24 Aug, 2016 22:28 IST|Sakshi
  • కోటి మీటర్ల వస్త్రానికి 18 లక్షలే ఉత్పత్తి 
  • టెస్కో వీసీఎండీ శైలజారామయ్యర్‌ 
  •  సిరిసిల్ల : కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న వస్త్రం నాణ్యత బాగుందని, ఆర్వీఎంకు వస్త్రం కొనుగోళ్లను శుక్రవారం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర టెస్కో వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ అన్నారు. బుధవారం ఆమె సిరిసిల్లలోని మ్యాక్స్‌ సొసైటీల నిర్వాహకులతో స్థానిక నేత బజారులో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్‌ అందించేందుకు అవసరమైన వస్త్రాన్ని సిరిసిల్లలోని మ్యాక్స్‌ సొసైటీల ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెుత్తం కోటి మీటర్ల వస్త్రం అవసరం ఉండగా.. ఇప్పటివరకు 18 లక్షల మీటర్ల వస్త్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేశారని తెలిపారు. ఇలా చేస్తే విద్యాసంవత్సరం ముగిసినా పిల్లలకు యూనిఫామ్స్‌ అందివ్వలేమన్నారు. సకాలంలో వస్త్రాన్ని అందించేందుకు వస్త్రోత్పత్తి వేగాన్ని పెంచాలని, మగ్గాల సంఖ్యను పెంచి, కొత్త సభ్యులను చేర్చుకోవాలని సూచించారు. సొసైటీల్లో పనిచేస్తున్న కార్మికులు, రోజువారీ ఉత్పత్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, రికార్డులు లేకుండా వస్త్రం కొనుగోలు చేయలేమని ఆమె స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన వస్త్రానికి పది రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ ప్రీతిమీనా తెలిపారు. స్థానిక వెంకంపేటలోని మరమగ్గాల్లో వస్త్రోత్పత్తి తీరును తనిఖీ చేశారు. మంచె శ్రీనివాస్‌ అనే వ్యాపారి వద్ద నిల్వ ఉన్న ఐదు లక్షల మీటర్ల వస్త్రాన్ని పరిశీలించారు. వారివెంట ఆర్‌డీడీలు పూర్ణచందర్‌రావు, రాంగోపాల్, రమణమూర్తి, ఏడీ వెంకటేశం, మ్యాక్స్‌ సొసైటీ ప్రతినిధులు వేముల దామోదర్, గుంటుక కోటేశ్వర్, జిందం దేవదాస్, అంకారపు రవి, చిమ్మని ప్రకాశ్, వేముల వెంకటనర్సు, గౌడ శ్రీనివాస్‌ ఉన్నారు. 
     
     
     
మరిన్ని వార్తలు