దక్షిణ మధ్య రైల్వే జీఎం బదిలీ

12 Dec, 2016 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏడాది తిరక్కుండానే దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర గుప్త బదిలీ అయ్యారు. రైల్వే బోర్డులో కీలక మెంబర్‌ రోలింగ్‌ స్టాక్‌గా ఆయన పదోన్నతిపై వెళ్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులు, రైల్వేలైన్ల విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ తీవ్రంగా ఉన్న తరుణంలో జీఎంగా నియమితులైన రవీంద్ర గుప్తా ఏడాది కూడా పని చేయకుండానే బదిలీ కావటం విశేషం. మరో రెండు మూడు రోజుల్లో గుప్తాకు అధికారికంగా ఉత్తర్వులు అందనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నుంచి భారీగా ఆదాయాన్ని పిండుకుంటున్న రైల్వే శాఖ, ఈ ప్రాంతంలో రైల్వే సేవలను విస్తరించే విషయంలో మాత్రం తీవ్ర నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.

సమర్థులైన జీఎంలను కేటాయించి, వారు ఎక్కువ కాలం ఇక్కడ పని చేసేలా చూస్తేనే పురోగతి సాధ్యమవుతుందనే రెండు రాష్ట్రాల ఒత్తిడి నేపథ్యంలో గుప్తాను రైల్వే శాఖ నియమించింది. ఆయన పదవీ విరమణకు సమయం ఎక్కువగానే ఉన్నందున దక్షిణ మధ్య రైల్వేకు మంచి రోజులు వస్తాయని అంతా ఆశించారు. కాని కేంద్రం మాత్రం.. చీటికి మాటికి జీఎంను మార్చటం వల్ల దక్షిణ మధ్య రైల్వే పురోగతి కుంటుపడుతోందన్న వాదనను మరోసారి నిజం చేసిచూపింది. కీలక దక్షిణ మధ్య రైల్వేలో కనీసం ఏడాది  పని చేస్తే ప్రధానమైన రైల్వే బోర్డులో చోటు దక్కించు కోవచ్చని అధికారులు ఈ జోన్‌పై దృష్టి సారిస్తున్నారన్న విమర్శకు మరోసారి బలం చేకూర్చినట్టయింది.

దక్షిణమధ్య రైల్వేను ప్రశంసించిన రైల్వే బోర్డు  
పదోన్నతిపై వెళ్తున్న జీఎం రవీంద్రగుప్తాకు సత్కారం

రైళ్ల భద్రత, రైల్వేపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు దక్షిణమధ్య రైల్వే మెరుగైన చర్యలు తీసుకుంటోందని రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ అభినందించారు. రైల్వే ఆస్తుల వినియోగం విషయంలోనూ మెరుగ్గా వ్యవహరిస్తోందన్నారు. సోమవారం ఆయన అన్ని జోన్ల జీఎంలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రైళ్ల భద్రత విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం జీఎం రవీంద్రగుప్తా వీడియో కాన్ఫరెన్సు ద్వారా జోన్‌ పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్షించారు.

శీతాకాలంలో రైలు పట్టాల వెల్డింగులు, జాయింట్లు ప్రమాదకరంగా మారతాయని, పగుళ్లు ఏర్పడే అవకాశం ఉన్నందున అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో శ్రద్ధగా పనిచేసిన వారికి పురస్కారాల కోసం పేర్లను సూచించారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి తీరుపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. పదోన్నతిపై వెళ్తున్న జీఎం రవీంద్రగుప్తాను రైల్‌ నిలయం ఆడిటోరియంలో దక్షిణమధ్య రైల్వే లలిత కళాసమితి ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

మరిన్ని వార్తలు