ఎంపీ నిధుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

21 Aug, 2016 00:01 IST|Sakshi
కాకినాడ సిటీ : ఎంపీ లాడ్స్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. ఎంపీ లాడ్స్‌ పనుల ప్రగతిపై పంచాయతీరాజ్‌ అధికారులతో తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన శనివారం సమీక్షించారు. గత సంవత్సరం ఎంపీ లాడ్స్‌కు సంబంధించి కాకినాడ డివిజన్‌లో 57 పనులకు 47, రాజమండ్రి డివిజన్‌లో 22కు 10, అమలాపురం డివిజన్‌లో 76కు 66 పనులు పూర్తయ్యాయన్నారు. 18 పనులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. మిగిలిన 17 పనులూ పూర్తి కాకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ ప్రారంభం కాని పనులకు సంబంధించిన సమస్యలను గుర్తించి అవసరమైతే ఎంపీల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో భవనాన్ని 590 ఎస్‌ఎఫ్‌టీలలో రూ.7.50 లక్షలతో నిర్మించాలన్నారు. అంగన్‌వాడీ భవన నిర్మాణాల భూమి లెవెలింగ్‌ను ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేపట్టాలన్నారు. తక్కువ పిల్లల హాజరు ఉన్నచోట మంజూరు చేసినవి రద్దు చేసి, ఎక్కువ హాజరున్నవాటికి రీ శాంక్షన్‌ ఇస్తామన్నారు. రెండు అంగన్‌వాడీ భవనాలు కలిపి ఒకేచోట నిర్మించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ మోహనరావు, ప్రణాళిక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జగన్‌మోహనరావు, పంచాయతీరాజ్‌ ఈఈలు ఎం.నాగరాజు, రాఘవరెడ్డి, బి.సత్యనారాయణరాజ్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు