ఇక అన్ని మిడియాల్లో ప్రమాణిక భాష

21 Aug, 2016 00:05 IST|Sakshi
మాట్లాడుతున్న అల్లం నారాయణ. చిత్రంలో డాక్టర్‌ సినారె తదితరులు

సుల్తాన్‌బజార్‌: అన్ని జిల్లాల మాండలిక పదాలతో ఒక ప్రామాణిక భాషను రూపొందించి పత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రయోగించాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆడిటోరియంలో శనివారం ‘తెలుగు పత్రికలు–ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం’ అనే అంశంపై సదస్సు జరిగింది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ సదస్సును ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలుగు పత్రికల్లో ప్రామాణిక భాష పేరుతో రెండున్నర జిల్లాల భాషను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి ఇతర ప్రాంతాల భాషలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పత్రికల భాషలనే అలవర్చుకున్నారని తెలిపారు. సినిమా భాష ప్రజల శిరస్సుపై తాండవం చేసిందన్నారు. పత్రికా భాషను సరళీకృతం చేసేందుకు నండూరి రామ్మోహన్, నాగుల వెంకటేశ్వరరావులు ముఖ్యపాత్ర పోషించారన్నారు.

తెలంగాణ భాషలో పత్రిక రచన కష్టమని, ఇన్నాళ్లుగా ఉన్న భాషా స్వరూపం మార్పు చెందాలంటే మాండలికాలు ఏకరూపం చేయాలని అభిప్రాయపడ్డారు. వాల్‌పోస్టర్‌ను గోడపత్రిక అని రాస్తున్నారని, వాల్‌ అంటే గోడ అని, పోస్టర్‌ అంటే పత్రిక కాదన్నారు. ప్రస్తుత ‘సాక్షి’ దినపత్రిక ఈడీ రామచంద్రమూర్తి గతంలో ప్రసార భాషలో కొన్ని మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య, సాహితీ ప్రియులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు