వాట్సాప్ లో టెన్త్ ప్రశ్నాపత్రం

22 Mar, 2016 11:11 IST|Sakshi
వాట్సాప్ లో టెన్త్ ప్రశ్నాపత్రం
  •      లీకైన ‘పది’ తెలుగు పేపర్!
  •      వదంతులేనన్న జిల్లా కలెక్టర్
  •      పరీక్షకు తొలిరోజు 6,53,549 మంది హాజరు
  •      నాలుగు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు
  •      విధుల నుంచి 10 మంది సిబ్బంది తొలగింపు
  • రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయ్యింది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ పరీక్ష కేంద్రం-ఎలో ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవ్వగా.. ప్రశ్నపత్రం 10.23కల్లా వాట్సాప్లో బయటకు వచ్చేసింది. ప్రశ్నలు తెలిసిపోవడంతో పరీక్షా కేంద్రం బయట ఉన్న కొందరు సంబంధిత జవాబులను పుస్తకాల నుంచి సేకరించబోయూరు. ఇంతలో విలేకరులు అక్కడకు వెళ్లగా వారు పారిపోయారు. ఈ హడావుడిలో ఓ వ్యక్తి వదిలి వెళ్లిన సెల్ఫోన్ను పరిశీలించగా.. అందులో తెలుగు ప్రశ్నప్రత్రం దర్శనమిచ్చింది. ఏజెన్సీ ఇన్చార్జి డీఈవో టీవీఎస్జీ కుమార్ మధ్యాహ్నం పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ బాబూరావుతో పాటు సిట్టింగ్ స్క్వాడ్ సీతారాములు, ఇన్విజిలేటర్లను ఆయన విచారించారు.

    అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రశ్నపత్రం బయటకు రావడంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నివేదికను కలెక్టర్కు అందచేస్తామని తెలిపారు. కాగా, జిల్లా కలెక్టర్ మాత్రం ప్రశ్నపత్నం లీకేజీ ఒట్టి వదంతేనని కొట్టిపారేశారు. కూనవరం జెడ్పీ హైస్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రశ్నపత్రం లీకేజీ వదంతిని వ్యాపింపజేసినవారిపై విచారణ జరపాలని కోరుతూ జిల్లా ఎస్పీ రవిప్రకాశ్కు ఫిర్యాదు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి నరసింహారావు తెలిపారు. పరీక్ష ముగిసిన మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే వాట్సాప్లోకి ప్రశ్నపత్రం వచ్చిందని చెప్పారు.

     ప్రశాంతంగా పరీక్షలు...
    రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజున మొత్తం 3,028 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 6,57,596 మందికి గానూ 6,53,549 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరీలో చిత్తూరు జిల్లా(803 మంది) ప్రథమస్థానంలో ఉంది. గుంటూరు రెండో స్థానం(414 మంది)లో ఉండగా.. శ్రీకాకుళం జిల్లా (120 మంది) చివరి స్థానంలో నిలచింది. ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ పది మంది సిబ్బందిని తొలగించారు. అనంతపురం జిల్లా గాండ్లపెంటలోని జెడ్పీ పాఠశాలలోని రెండు గదుల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు గుర్తించి ఇన్విజిలేటర్లుగా ఉన్న చంద్రమోహన్రెడ్డి, వెంకటరమణారెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ తహశీల్దార్ నాగరాజు ఆదేశాలు జారీ చేశారు.
     
    తెలుగు ప్రశ్నపత్రంలో పొరపాట్లు

    తెలుగు పేపర్-1లో తప్పులు దొర్లినట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షుడు ఎం.డి.ఇబాదతుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. 1, 3, 5 పాఠ్యాంశాల నుంచి ప్రతిపదార్థాలు అడగాల్సి ఉండగా ఐదో పాఠం నుంచే రెండు ప్రశ్నలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులు ఐదు మార్కులు నష్టపోతారని, వీటిని కలపాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు