అసలేమైంది..

24 May, 2016 19:45 IST|Sakshi
అసలేమైంది..

 కాకినాడలో విద్యార్థి ఆత్మహత్య
 కాకినాడ సిటీ : ఆరునెలల సీపీటీ (కామన్ ప్రొఫిసియన్సీ టెస్ట్) కోర్సు చదువుతున్న విద్యార్థి రెడ్డి సాయికుమార్(20) హాస్టల్ రూమ్‌లో ప్యాన్‌కు ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం కొత్త గాజువాకకు చెందిన రెడ్డి సాయికుమార్ ఈ ఏడాది జనవరిలో కాకినాడ భాస్కర్‌నగర్‌లోని ప్రిజమ్ అకాడమీలో సీపీటీ కోచింగ్‌కు చేరాడు.
 
 తండ్రి వెంకటరమణ కొత్త గాజువాకలో ఫాస్ట్‌పుడ్ వ్యాపారం చేస్తుంటాడు. గతనెలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇంటికి వెళ్లి పదిరోజులక్రితం తిరిగి కాకినాడ వచ్చాడు. అప్పటి నుంచి అకాడమీ తరగతులకు వెళ్లకుండా రూమ్‌లోనే ముభావంగా ఉంటున్నాడు.
 
 సోమవారం ఉదయం హాస్టల్ రూమ్‌లోని తోటి విద్యార్థులు తరగతులకు వెళ్లగా.. సాయికుమార్ రూమ్‌లోనే ఉండిపోయాడు. తిరిగి మధ్యాహ్నం రూమ్‌కు వచ్చిన విద్యార్థులు తలుపులు మూసి ఉండడంతో వెనుక వైపునకు వెళ్లి చూడగా ప్యాన్‌కు వేలాడుతూ సాయికుమార్ కనిపించాడు. తలుపులు బద్దలు కొట్టి స్థానిక ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పడంతో విద్యార్థులు తిరిగి రూమ్‌కు తీసుకువచ్చినట్టు పోలీసులు తెలిపారు.
 
 ప్రేమ విఫలమై.. డిగ్రీ పరీక్షలు సరిగా రాయక..
 రూమ్‌లో ఉండే ఫ్రెండ్స్‌తో తాను ప్రేమించిన అమ్మాయి ప్రేమను తిరస్కరిస్తోందని, డిగ్రీ పరీక్షలు కూడా సరిగా రాయలేక పోయానని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే సెల్‌ఫోన్ మెసేజ్‌ల ఆధారంగా ప్రేమ విఫలంతో మన స్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సాయికుమార్ బంధువులు మాత్రం అకాడ మీ యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. ప్రేమ విషయం తమకు తెలియదని, అటువంటి వాటికి ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం తమ కుమారుడిది కాదని తండ్రి వెంకటరమణ  పేర్కొన్నారు. కాకినాడ టూటౌన్ ఎస్సై వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు