సుశీలది హత్యే..

9 Jun, 2016 02:06 IST|Sakshi
సుశీలది హత్యే..

ఈనెల ఒకటిన ముదిమాణిక్యం వద్ద ఘటన
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
కోరిక తీర్చనందుకే రాజు హతమార్చాడని డీఎస్పీ వెల్లడి

జోగిపేట: వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కోరిక తీర్చనందుకే ఓ యువకుడు ఆమెను అంతమొదించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈనెల ఒకటిన పుల్‌కల్ మండలం ముదిమాణిక్యం శివారులో జరిగిన హత్య కేసు వివరాలను మెదక్ ఇన్‌చార్జి డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు బుధవారం జోగిపేటలోని సీఐ చాంబర్‌లో విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా... పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ పంచాయతీ పరిధిలోని సువాలీ తండాకు చెం దిన గోరాం సుశీల (30), సురేశ్ దంపతులు. వీరు సంగారెడ్డిలో అడ్డా కూలీలు. కొన్ని రోజులుగా భార్యాభర్తలు వేర్వేరుగా పనులు చేసుకుంటున్నారు. ఈనెల ఒకటిన ఆమె పనుల కోసం సంగారెడ్డికి వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఓ బావిలో ఆమె శవం లభించింది.

 ఫోన్ కాల్స్ ఆధారంగా...
సుశీల ఫోన్‌కాల్స్ ఆధారంగా బస్వాపూర్‌కు చెందిన వెండికోలు రాజును నిందితుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. సుశీలతో వెండికోలు రాజుకు గత రెండు నెలలుగా సన్నిహిత సంబంధం ఉంది. రెండు నెలల్లోనే సెల్‌ఫోన్‌లో 274 సార్లు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఘటన జరిగిన రోజున ఆ స్థలంలో టవర్లను పరిశీలించగా కేవలం సుశీల, రాజుకు సంబంధించిన ఫోన్ నంబర్లు మాత్రమే పనిచేశాయి. బుధవారం అతణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు.

 ఆ రోజు ఏం జరిగిందంటే...?
బస్వాపూర్‌కు చెందిన వెండికోలు రాజు సుశీలతో సన్నిహితంగా ఉంటున్నాడు. జూన్ ఒకటిన సంగారెడ్డి నుంచి రాజు, సుశీల ఒకే బస్సులో పక్కపక్కనే కూర్చోని వచ్చారు. సాయంత్రం 6.15 గంటలకు ముదిమాణిక్యం గ్రామంలో సుశీల దిగిపోయింది. బస్వాపూర్‌లో రాజు దిగి ఇంటికి వెళ్లాడు. అప్పుడే రాజు సుశీలకు ఫోన్ చేశాడు. ‘నేను ఇంటికి వెళ్లి వెంటనే వస్తా,  నీవు ముదిమాణిక్యం వద్దే ఉండాలి’ అని సూచించాడు. అప్పుడే సుశీలకు ఆమె భర్త సురేశ్ ఫోన్ చేసి నీవు ఎక్కడున్నావ్? అని అడగ్గా,  ముదిమాణిక్యం కల్లు దుకాణం వద్ద ఉన్నానని చెప్పింది. తండాకు బయలుదేరాలని, తాను ఎదురుగా వస్తానని ఫోన్‌లో చెప్పాడు. వెంటనే ఆమె ఇదే విషయాన్ని వెండికోలు రాజుకు తెలిపింది.

అయినా అతను వినిపించుకోకుండా తాను వచ్చేంతవరకు ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. అయినా ఆమె వినకుండా ముదిమాణిక్యం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న సువాలీ తండాకు కాలినడకన బయలు దేరింది. రాజు ఫోన్ చేస్తున్నా ఆమె కట్ చేస్తుండడంతో ఆగ్రహించాడు. ఆమె మార్గమధ్యంలో అడ్డగించాడు. సురేశ్ వస్తున్నాడు వెళ్లిపో... అని ఆమె ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా తన కోరిక తీర్చాలంటూ గొడవకు దిగాడు. ఆమె అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్ వైరుతో ఆమె గొంతుకు బిగించి గట్టిగా లాగడంతో అక్కడికక్కడే ప్రాణాలు వది లింది. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని దగ్గరలోని బావి లోకి తోసేసిన రాజు బస్వాపూర్‌లోని తన ఇంటికి  వెళ్లిపోయాడని డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జోగిపేట సీఐ వెంకటయ్య, పుల్కల్ ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు