టీడీపీలో ఓటమి భయం

26 Oct, 2016 22:26 IST|Sakshi
– గోపాలపురం ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయించేందుకు యత్నాలు
– అవసరమైతే పోలీసుల్ని రంగంలోకి దింపి అధికార దుర్వినియోగానికి పాల్పడాలని మంత్రి ఆదేశం
– వైఎస్సార్‌ సీపీ నాయకులపై తప్పుడు కేసులు
 
గోపాలపురం :
తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ నెల 28న నిర్వహించాల్సిన గోపాలపురం మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయించేందుకు యత్నాలు ప్రారంభించింది. లేదంటే పోలీసుల్ని రంగంలోకి దింపి.. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎంపీటీసీలను దారికి తెచ్చుకోవాలంటూ సాక్షాత్తు ఓ మంత్రి టీడీపీ నాయకులకు ఆదేశాలు ఇవ్వడం ఆ పార్టీ నేతల్లో నెలకొన్న భయాన్ని వెల్లడిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి.. దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపారు.

వివరాల్లోకి వెళితే.. గోపాలపురం ఎంపీపీగా పనిచేస్తూ గద్దే వెంకటేశ్వరరావు గతనెల 24న గుండెపోటుతో మరణించారు. ఆయన స్థానంలో కొత్త ఎంపీపీని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈనెల 28న ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 10 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు ఉన్నారు. చిట్యాల ఎంపీటీసీగా గెలిచిన గద్దే వెంకటేశ్వరరావు మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ప్రస్తుతం టీడీపీ ఎంపీటీసీల సంఖ్య 9, వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీల సంఖ్య 8గా ఉన్నాయి. స్థానిక పరిస్థితులు, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎంపీటీసీల్లో అసంతప్తి నెలకొంది. ఈ తరుణంలో ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తే కొందరు ఎంపీటీసీలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడతారనే భయం టీడీపీ నేతలను వెన్నాడుతోంది. దీంతో 9మంది ఎంపీటీసీలను రాజమండ్రిలో ఏర్పాటు చేసిన రహస్య శిబిరానికి తరలించారు.

అయితే, వేళ్లచింతలగూడెం ఎంపీటీసీ దాకే రమేష్‌బాబు టీడీపీ శిబిరం నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశారు. ఎంపీపీ ఎన్నికల్లో తనకు నచ్చిన వారికి ఓటు వేస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. తమ పార్టీ ఎంపీటీసీల్లో కొందరు చేజారిపోతారన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసు బనాయించారు. ఎంపీటీసీ రమేష్‌బాబు వైఎస్సార్‌ సీపీకి చెందిన ముగ్గురు నాయకులు, మరికొందరు కార్యకర్తలు తీసుకెళ్లిపోయారంటూ ఫిర్యాదు చేశారు. అయితే, టీడీపీ శిబిరం నుంచి తప్పించుకున్న ఎంపీటీసీ రమేష్‌బాబు తనను ఎవరూ తీసుకెళ్లలేదని, ఎవరి నిర్బంధంలోనూ లేనని పత్రికలకు తెలియజేశారు. ఇదిలావుండగా, అసంతప్త సెగలు రాజుకోవడంతో ఎంపీపీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 28న జరగాల్సిన ఎన్నికను ఏదో రకంగా వాయిదా వేయించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. అవసరమైతే అధికార దుర్వినియోగానికి పాల్పడాలని.. పోలీసులను పెద్దఎత్తున ఉపయోగించుకోవాలంటూ ఓ మంత్రి టీడీపీ నేతలను ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, ఆ పార్టీ ఎంపీటీసీలను ఎన్నికకు హాజరుకాకుండా ఆటంకాలు సష్టించే పనిలో అధికార పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
 
మరిన్ని వార్తలు