పత్రికలకెక్కితే తీవ్ర పరిణామాలు

5 Jul, 2016 09:19 IST|Sakshi

అభివృద్ధి పనులు ఇన్‌చార్జిల ద్వారానే జరగాలి
టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం తీర్మానం
 
 నెల్లూరు : గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే ప్రతి అభివృద్ధి పనీ ఆ నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు తెలిసే జరగాలని తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది.  నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు నేతృత్వంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
 
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమైతే తీవ్రంగా నష్టపోతామని ఇన్‌చార్జి మంత్రి పార్టీ నాయకులకు హితవు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్ ఇటీవల చేసుకున్న పరస్పర ఆరోపణలు పార్టీకి నష్టం కలిగించేవిలా ఉన్నాయని సీఎం అసహనంగా ఉన్నారని ఇన్‌చార్జి మంత్రి చెప్పారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యేకి  మున్సిపల్ చైర్‌పర్సన్‌కు జరుగుతున్న అంతర్గత గొడవల విషయం మీద కూడా చర్చించారు.
 
ఎమ్మెల్యే ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోరాదనీ, అలాగే చైర్‌పర్సన్ కూడా ఎమ్మెల్యేతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో వార్డు, డివిజన్ ఇన్‌చార్జిలు ప్రతిపాదించే పనులను అలాగే మంజూరు చేయకుండా సంబంధిత పార్టీ ఇన్‌చార్జిలతో చర్చించి వారి సిఫారసు మేరకే మంజూరు చేయాలని ఇన్‌చార్జి మంత్రి చెప్పారు.

అన్ని శాఖల అధికారులకు కూడా ఇదే ఆదేశాలు జారీ చేస్తామనీ, పార్టీ వర్గాలు సమన్వయం తో పనులు చేయించాలని సూచించారు. ఇన్‌చార్జిలు చెప్పిన పనులే చేసుకుంటూ పోతే ఇక తామెందుకు ఉన్నట్లు అని ఒక ప్రజాప్రతినిధి సమావేశంలోనే తన అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది.
 
తాము కూడా ప్రజలు ఎన్నుకుంటేనే పదవుల్లో ఉన్నామనీ, తాము కూడా రాజకీయాల్లో పైకి ఎదగాలనుకుంటున్నామనీ, అలాంటప్పుడు అన్నీ ఇన్‌చార్జిలకు చెప్పే చేయాలంటే ఎలా కుదురుతుందని నిలదీశారని తెలిసింది. అభ్యంతరాలు ఉంటే తన దృష్టికో, జిల్లా మంత్రి నారాయణ దృష్టికో తెచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప పత్రికలకెక్కితే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని శిద్దా రాఘవరావు హెచ్చరించారు.

మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్టీ ఇన్‌చార్జిలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీదర్‌కృష్ణారెడ్డి, డాక్టర్ జ్యోత్స్నలత, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తో పాటు పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా