ఎమ్మెల్సీ సీటు కోసం.. టీడీపీలో కుమ్ములాట

7 Feb, 2017 18:14 IST|Sakshi
ఎమ్మెల్సీ సీటు కోసం.. టీడీపీలో కుమ్ములాట

► కొల్ల ఆశలకు నాయకుల గండి?
► ‘డబ్బు’న్న వారివైపే మొగ్గు!
► సీటు కోసం బగ్గు గాలం?
► కలిశెట్టి ఆశలు నెరవేరేనా?
► అచ్చెన్న, కళా చెరోవైపు పావులు
► అధిష్టానం ఎంపికపైనే ఉత్కంఠ


‘తమ్ముళ్లూ... తొలినుంచి పార్టీ జెండా మోస్తున్నవారెవ్వరో నాకు తెలుసు... నన్ను నమ్ముకున్నవారికి న్యాయం చేస్తా! నన్ను నమ్మండి తమ్ముళ్లూ...’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీతో ఆ పార్టీలో పలువురు ఆశావహులు పెద్దల సభలో అడుగుపెట్టాలని కలలుగంటున్నారు! స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పీరుకట్ల విశ్వప్రసాద్‌ పదవీకాలం మరో నెలలో ముగియనుంది. ఆ సీటు కోసం ఇంకా నోటిఫికేషన్‌ రాకముందే అధికార పార్టీలో పోటీ మొదలైంది. ఎలాగైనా సరే ఈ సీటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావులను ప్రసన్నం చేసుకొనే పనిలో తలమునకలై ఉన్నారు. అయితే తమకు అనుకూలమైనవారిని, అదీ భవిష్యత్తులో తమ రాజకీయ అవసరాలకు ఉపయోగపడేవారిని ఆ సీటులో కూర్చోబెట్టేందుకు ఇరువురు నాయకులు కూడా తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని ఆ పార్టీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతానుభవాల నేపథ్యంలో ఏదిఏమైనా ‘డబ్బు’న్నవారివైపే అధిష్టానం మొగ్గు చూపిస్తుందనే అనుమానాలూ లేకపోలేదు. ఇదే జరిగితే సుదీర్ఘకాలంగా ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నవారి ఆశలపై నీళ్లు చల్లినట్లే!

సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ఎమ్మెల్సీ సీటు కోసం అధికార పార్టీలో గత దఫాలో వినిపించిన పేర్లే మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ అధికారంలో ఉండటం, ప్రతిపక్ష పార్టీ నుంచి కొంతమంది ఎంపీటీసీలు, జడ్‌పీటీసీ సభ్యులను రకరకాలుగా ప్రలోభపెట్టి లాక్కొన్న నేపథ్యంలో సీటు వస్తే గెలుపు ఖాయమనే ధీమా టీడీపీ వారిలో కనిపిస్తోంది. దీంతో ఏ రకంగానైనా సరే సీటు దక్కించుకోవాలని ఎవ్వరికివారే విశ్వప్రయత్నాలు అప్పుడే ప్రారంభించేశారు. గత వారం శ్రీకాకుళంలో జరిగిన టీడీపీ కార్యవర్గ సమావేశంలో కొంతమంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. సీనియర్‌ నాయకుడు, సంతకవిటి మండలంలో నాలుగుసార్లు ఎంపీపీ పదవి నిర్వహించిన కొల్ల అప్పలనాయుడు ఈ సీటు రేసులో ముందున్నారు. అలాగే మరో సీనియర్‌ నేత, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), ఎల్‌ఎల్‌ నాయుడు, నడుకుదిటి ఈశ్వరరావుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వేడిని తగ్గించడం కోసం మందసకు చెందిన జుత్తు నీలకంఠం, కోటబొమ్మాళికి చెందిన బోయిన గోవిందరాజులు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ సింతు సుధాకర్, దివంగత నాయకుడు గొర్లె హరిబాబునాయుడు భార్య లలితకుమారి పేర్లను వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా టీడీపీలో ఎస్సీ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే ఫిర్యాదులున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ సీటు ఆ సామాజికవర్గానికి కేటాయించాలనే వాదనలు మొదలయ్యాయి. దీంతో ఎస్‌వీ రమణమాదిగ తదితరులు ఆశలు పెంచుకుంటున్నారు.

ఎవ్వరి మాట నెగ్గేనో?
జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరులో ఇప్పటివరకూ అచ్చెన్న మాటే నెగ్గుతూ వచ్చింది. అయితే చిన్నబాబు ప్రోద్భలంతో కళావెంకటరావు జిల్లాపై తన పెత్తనాన్ని ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపికపై ఎవ్వరి మాట నెగ్గుతుందోనని పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కొల్ల అప్పలనాయుడికి వీరిద్దరి నుంచి సహకారం లభించే పరిస్థితి కనిపించట్లేదు. కొల్ల పేరు గతంలో జడ్‌పీ చెర్మన్, ఎమ్మెల్సీ పదవుల కోసం పరిశీలనలోకి వచ్చింది. ఆఖరి నిమిషంలో చాన్స్‌ దక్కలేదు. వచ్చేసారి ఎమ్మెల్సీ సీటు తప్పకుండా ఇస్తామని ఆశచూపించి గత శాసనసభ ఎన్నికలలో ఆయన సేవలను వాడుకున్నారు. కళావెంకటరావు టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయినప్పుడు రాజాం ప్రాంతంలో పార్టీని నిలబెట్టడంలో కొల్ల కీలక పాత్ర పోషించారు. కళా మళ్లీ తిరిగి టీడీపీలోకి రావడం, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొల్ల ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. ఎమ్మెల్సీని చేస్తానంటూ గతంలో కొల్లకు దివంగత నాయకుడు ఎర్రన్నాయుడు ఇచ్చిన మాటను అతని సోదరుడు అచ్చెన్నాయుడు నెరవేర్చలేకపోయాడనే నిందను ఆపాదించేందుకు కళావర్గానికి ఇదొక మంచి అవకాశమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

బగ్గు వైపే అచ్చెన్న మొగ్గు!
ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే టెక్కలి నియోజకవర్గంలోకి సారవకోట, పోలాకి మండలాలు కలిసే అవకాశం ఉందనే ప్రచారం జరగడం, అదే జరిగితే అక్కడి గట్టి పట్టువున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు నుంచి 2019 సాధారణ ఎన్నికలలో తనకు సీటు విషయంలో పోటీ లేకుండా చూసుకోవడమనే వ్యూహంతో అచ్చెన్న పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆర్థికంగానూ బలమైన బగ్గును ఎమ్మెల్సీ చేస్తే తనకు అన్నివిధాలా ఉపయోగం ఉంటుందని అచ్చెన్న ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘పార్టీ మారి తిరిగి రావడం ఎమ్మెల్సీకి అర్హతా?’ అని పలాస ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడు జీఎస్‌ఎస్‌ శివాజీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పార్టీలో కరివేపాకులేనా?
పార్టీలో ఎర్రన్నాయుడికి అనుచరుడిగా ఎదిగిన కలిశెట్టి అప్పలనాయుడు... పార్టీకి తాను చేసిన సేవల దృష్ట్యా తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరుతున్నాడు. గతంలో పాతపట్నం సీటు పోటీ నుంచి కలిశెట్టిని తప్పించడానికి ఎమ్మెల్సీ సీటు ఆశ చూపించారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఆ అంశాలతోనే నేరుగా అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు. గతంలో మూడు పర్యాయాలు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చౌదరి బాబ్జీ, అలాగే బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎల్‌ఎల్‌ నాయుడు పేర్లను కేవలం వారి సామాజికవర్గ కోణంలో మాత్రమే తెరపైకి తెచ్చారనే వాదన ఉంది. అంత రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం గత ఎన్నికలలో కళా వెంకటరావుకు అన్ని రకాలుగా సాయపడిన నడుకుదిటి ఈశ్వరరావు పేరును జాబితాలో చేర్చారు. ఇక సింతు సుధాకర్, జుత్తు నీలకంఠం, బోయిన గోవిందరాజులు జాబితాలో పేరుకే పరిమితమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు