కాపు కులస్థులకే మేయర్‌ పీఠం

8 Aug, 2017 23:34 IST|Sakshi
కాపు కులస్థులకే మేయర్‌ పీఠం
భానుగుడి (కాకినాడ): కాకినాడ నగర మేయర్‌ పీఠాన్ని కాపు కులస్తులకే ఇవ్వాలని అ««ధిష్టానం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 48వ వార్డుల్లో పోటీచేసే తేదేపా అభ్యర్థుల జాబితాను జిల్లా పార్టీ కార్యవర్గం సిద్ధం చేసిందని, పరిశీలనకు అధిష్టానానికి పంపినట్లు పేర్కొన్నారు. ఆమోదముద్ర పడగానే జాబితాను విడుదల చేస్తామని రాజప్ప ప్రకటించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కళా వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సంధానకర్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాకినాడ నగర పార్టీలో కాపు వర్గీయులకు–ఎమ్మెల్యేకు మధ్య ఉన్న పొరపొచ్చాలను విలేకరులు ప్రశ్నించగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి ముందుకెళతామన్నారు. ముద్రగడ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని ప్రశ్నించిన విలేకరులపై  విరుచుకుపడ్డారు. కాపులకు ఎప్పుడూ పార్టీలో గుర్తింపు ఉందని, ముద్రగడ గేటువరకు వచ్చి డబ్బు కొట్టి వెనక్కి వెళుతున్నారని, ఇదేం పద్ధతో అర్థం కావడం లేదని ముద్రగడ ఆందోళనను అవహేళన చేసేలా మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు