ప్రతిపక్షంపై ఎదురుదాడి చేద్దాం

13 Dec, 2015 09:58 IST|Sakshi

హైదరాబాద్: ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయటం ద్వారా శాసనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ, మండలి వ్యూహ కమిటీ సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశం శనివారం రాత్రి జరిగింది.

ప్రతిపక్షం ఏ అంశం ప్రస్తావించేందుకు ప్రయత్నించినా ఎదురుదాడి చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత విమర్శలు చేయటం ద్వారా ఆ అంశాన్ని పక్కదారి పట్టించి చర్చకు రాకుండా చూడాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ప్రధానంగా ఇసుక అమ్మకాల్లో అక్రమాలు, కల్తీమద్యం, కాల్‌మనీ వ్యవహారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతివష్టి, కొన్ని జిల్లాల్లో అనావష్టి, ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్రంలో క్షీణించిన శాంతి,భద్రతలు తదితర అంశాలను ప్రస్తావిస్తుందని అన్ని అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో, ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్ది హయాంలో జరిగిన విధానాన్ని ప్రస్తావించి ఎదురుదాడి చేయటంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేయాలని నిర్ణయించారు.

ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తే అవసరమైతే ఒకరిద్దరు సభ్యులపై చర్య తీసుకోవటం ద్వారా భయపెట్టి నియంత్రించి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇసుక, బాక్సెట్, నీటిపారుదల రంగాలపై శ్వేతపత్రం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని నిర్ణయించారు. శాసనసభ బీఏసీ సమావేశం తొలిరోజు ప్రశ్నోత్తరాల తరువాత నిర్వహిస్తే ఎలా ఉంటుందని చర్చించారు. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తరువాత చేపట్టే అంశంపై కూడా చర్చించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకష్ణుడు, కె.అచ్చన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, చీఫ్‌విప్, విప్‌లు కాలవ శ్రీనివాసులు, యామినీబాల, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గాలి ముద్దుకష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చేపట్టిన విషయం తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు