బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్‌ వీరంగం

7 Jan, 2017 08:58 IST|Sakshi
బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్‌ వీరంగం

గుంటూరు : అధికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. మొన్న కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రివాల్వర్‌లో కాల్పులు జరిపి హల్‌చల్‌ చేయగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్‌ బాపట్ల బీచ్‌లో వీరంగం సృష్టించారు. బాపట్ల సూర్యలంక బీచ్‌లో హరిత రిసార్ట్స్‌ డిప్యూటీ మేనేజర్‌ శ్రీనివాస్‌పై దాడి చేశారు. గదిలోకి లాక్కెళ్లి మరీ అతడిని చితకాబాదారు. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు సిబ్బందిపైనా ఎమ్మెల్సీ దాడి చేశారు.

వివరాల్లోకి వెళితే... హరిత రిసార్ట్స్‌లో నిర్మాత కొరటాల సందీప్‌ పుట్టినరోజు వేడుకకు వచ్చిన అతిథులకు సరైన ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. బీచ్‌లో క్యాంప్‌ ఫైర్‌ వేసి స్నేహితులతో కలిసి ఎమ‍్మెల్సీ సతీశ్‌ చిందులు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు బాగోలేదంటూ ఎమ‍్మెల్సీ అక్కడి సిబ్బందిపై దౌర్జన్యం చేశారు.

అయితే  దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన హరిత రిసార్ట్స్‌ ఉద్యోగులకు చుక్కెదురు అయింది. తెల్లవారేవరకూ పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. కాగా ఈ వార్త రాస్తే మీ సంగతి చూస్తానంటూ విలేకర్లపై ఎమ్మెల్సీ సతీశ్‌ బెదిరింపులకు దిగారు. కాగా ఎమ్మెల్సీ గతంలో కూడా విలేకర్లతో దురుసుగా ప్రవర్తించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసి, వేషాలు వేస్తే తాటతీస్తానంటూ బెదిరించారు కూడా. ఇక నిర్మాత కొరటాల సందీప్‌ గతంలో బాపట్లలోని ఓ లాడ్జిలో పేకాడుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.