ముగిసిన ‘పది’ పరీక్షలు

30 Mar, 2017 23:23 IST|Sakshi
ముగిసిన ‘పది’ పరీక్షలు

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షలు గురువారం  ముగిశాయి. మడకశిర, కదిరి ఘటనలతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురైనా తర్వాత పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 17న పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజు జరిగిన సోషియల్‌ పేపర్‌–2 పరీక్షకు 48,978 మంది విద్యార్థులకు గాను 48,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 235 మంది గైర్హాజరయ్యారు. ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్, స్క్వాడ్‌ బృందాలు కలిపి మొత్తం 85 కేంద్రాలను పరిశీలించారు.

మడకశిర, కదిరి ఘటనలతో ఆందోళన
పరీక్ష ప్రారంభమైన తొలిరోజే మడకశిర ప్రభుత్వ  పాఠశాల ‘బీ’ కేంద్రం నుంచి తెలుగు పేపర్‌–1 ప్రశ్నపత్రం లీక్‌ కావడం దుమారం రేపింది. ఈ ఘటన రాష్ట్రమంతా ‘అనంత’ వైపు చూసేలా చేసింది. అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే రెండు రోజులకే హిందీ పరీక్ష మళ్లీ అలజడి రేపింది. ఇప్పుడే ఏకంగా మంత్రి నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబుపత్రాలు సిద్ధం చేస్తూ మీడియా కంటపడ్డారు. కదిరిలో జరిగిన ఈ ఘటన అ«ధికారులకు ఊపిరాడకుండా చేసింది. ప్రశ్నపత్రం ఇక్కడ లీకు కాలేదని ఎక్కడో బయట నుంచి తెప్పించుకుని ఇక్కడి మంత్రి పాఠశాలలో జవాబుపత్రాలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నారాయణ పాఠశాల విద్యార్థులు ఏయే కేంద్రాల్లో ఉన్నారో వారికి చేరవేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.

విద్యార్థులతో కిటకిటలాడిన బస్టాండు, రైల్వేస్టేషన్‌
పరీక్షలు ముగియడంతో హాస్టళ్లు, బంధువుల ఇళ్లలో ఉంటూ చదుకుంటున్న విద్యార్థులు సొంతూళ్లకు బయలుదేరారు. పరీక్ష ముగియగానే ఆనందంతో ఎగిరి  గంతులేశారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల సాయంతో ఊరికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్‌కు రావడంతో కిటకిటలాడాయి.

మరిన్ని వార్తలు