మేడపై అమ్మాయి.. ఊరంతా గాలింపు..

14 Sep, 2016 11:00 IST|Sakshi
మేడపై అమ్మాయి.. ఊరంతా గాలింపు..

5 గంటలపాటు హైరానా పడిన పోలీసులు, కుటుంబ సభ్యులు
చివరికి ఇంటిపై ఉన్న కూలర్‌లో దాక్కొనగా కనుగొన్న పోలీసులు 

ఖమ్మం : ఓ విద్యార్థిని ఆడిన నాటకంతో తల్లిదండ్రులు, పోలీసులు 5 గంటలపాటు నానా అవస్థలు పడ్డారు. అదృశ్యమైందనుకుని ఊరంతా గాలించారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా ట్రేస్‌ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి విద్యార్థిని ప్రియుడు ఇచ్చిన సమాచారంతో ఆ ఇంటిపైన ఉన్న వినియోగించని కూలర్‌లో దాక్కొని ఉన్న విద్యార్థినిని పోలీసులు గుర్తించారు. దీంతో 5 గంటల ఉరుకులు, పరుగుల నడుమ సాగిన హైడ్రామాకు తెరపడింది.

పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... సారథినగర్‌ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని అదే ప్రాంతంలోని ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం రాత్రి మందలించారు. ఉదయం ఆరు గంటలకు లేచి చూడగా సదరు విద్యార్థిని కనిపించలేదు. దీంతో వారు చుట్టు పక్కల వెతకగా ఆచూకీ తెలియరాలేదు. విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న యువకుడికి ఫోన్ చేయగా తాను సారపాకలో ఉన్నానని, విద్యార్థిని అదృశ్యం సంగతి తనకు తెలియదని వివరించాడు.

దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ మొగిలి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌ పెట్టగా సిగ్నళ్లు సారథినగర్‌ ప్రాంతం నుంచే వస్తున్నాయని గమనించారు. విద్యార్థిని సైతం తన సెల్‌ఫోన్‌ ఆఫ్‌ చేయకపోవడంతో రింగ్‌ అవుతోంది. దీంతో రైలుపట్టాల వెంట జీఆర్‌పీ సిబ్బంది, పోలీసులు సుమారు గంటకు పైగా వెతికారు. అక్కడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థిని ప్రియుడికి ఫోన్‌ చేసిన పోలీసులు గట్టిగా మందలించడంతో తాను ఆమెకు ఫోన్‌ చేసి ఎక్కడ ఉన్నది కనుక్కుని చెబుతానని చెప్పాడు.

కొద్ది సేపటి తర్వాత ఆ యువకుడు పోలీసులకు ఫోన్‌ చేసి విద్యార్థిని వాళ్లింట్లోనే ఉందని చెప్పడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంట్లో కనిపించకపోవడం వల్లనే వెతుకుతున్నామని ఎక్కడుందో చెప్పమని హెచ్చరించారు. దీంతో ఆ యువకుడు మరోసారి విద్యార్థినికి ఫోన్‌ చేసి వివరాలు సేకరించి పోలీసులకు తిరిగి ఫోన్‌ చేసి విద్యార్థిని మేడపై ఉన్న కూలర్‌లో ఉందని చెప్పాడు. అనంతరం పోలీసులు, కుటుంబ సభ్యులు మేడపై ఉన్న కూలర్‌లో చూడగా అందులో విద్యార్థిని ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. ఆమెను వెంటనే కిందకి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఐదు గంటలపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత చేసిన ఆ విద్యార్థినికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు.  

మరిన్ని వార్తలు