మందుల దుకాణం..అక్రమాల మకాం

13 Jul, 2017 02:03 IST|Sakshi
మందుల దుకాణం..అక్రమాల మకాం

∙ ఇష్టారాజ్యంగా నిర్వహణ
∙ ఫార్మసిస్టులు లేని దుకాణాలే ఎక్కువ
∙ డాక్టర్‌ చీటీ లేకుండానే విక్రయాలు
∙ నామమాత్రంగా పర్యవేక్షణ


నెల్లూరు (బారకాసు): జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా తయారైంది. ఏమాత్రం అవగాహన లేనివారు మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుకాణం నిర్వహించే వ్యక్తి ఫార్మసిస్టు అయి ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం ఇంటర్మీడియెట్‌ స్థాయి వరకు చదివిన వారైనా ఉండకపోవడం గమనార్హం. డాక్టర్‌ ధ్రువీకరించిన చీటి ఉంటేనే మందులు ఇవ్వాల్సి ఉంది. ఎటువంటి చీటీ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,420 మెడికల్‌ షాపులున్నాయి. ఇందులో హోల్‌సేల్‌ 432 కాగా, రిటైల్‌ దుకాణాలు 1,196. నెల్లూరులో 495 రిటైల్, 340 హోల్‌సేల్, గూడూరులో 330 రిటైల్, 23 హోల్‌సేల్, కావలిలో 371 రిటైల్, 69 హోల్‌సేల్‌ దుకాణాలున్నాయి. ఇవికాక గ్రామాల్లో దాదాపు 700 మెడికల్‌ షాపులు రిటైల్‌వి కాగా, 92 హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి.

దాదాపు 80శాతం దుకాణాలు ఫార్మసిస్టులు లేకుండానే నడుస్తున్నాయి. ఎక్కడైనా కొత్తగా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టడానికి పోటీ విపరీతంగా ఉంటుంది. పట్టణాల్లోనే ఫార్మసిస్ట్‌ లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే.. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జలుబు, జ్వరం వంటి చిన్న రుగ్మతలకు సైతం ఎంబీబీఎస్‌ వైద్యులు సిఫార్సు చేసిన చీటీ ఆధారంగానే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. చిన్న పిల్లలు వెళ్లి అడిగినా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్‌ సూచన మేరకు ఇచ్చే మందులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలి. బిల్లు కావాలంటే నిర్వాహకులు అదనంగా పది శాతం సొమ్ము వసూలు చేస్తున్నారు.

నామమాత్రపు తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాల నిర్వాహణపై ఔషధ నియంత్రణ శాఖ సహాయక సంచాలకుడి పర్యవేక్షణ ఉంటుంది. ఈ అధికారితోపాటు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ కూడా ఉంటుంది. వారు నామమాత్రపు తనిఖీలతో అప్పుడప్పుడూ కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు నెలకు 10 కేసుల చొప్పున నమోదు చేస్తూ అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన మందుల దుకాణాలపై 16 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే వందలకొద్దీ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

తనిఖీలు నిర్వహిస్తున్నాం
జిల్లాలోని మందుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. ఫార్మసిస్టులు లేకుండా మందుల దుకాణాలు నిర్వహించకూడదని ఆదేశిం చాం. డాక్టర్ల సూచనల మేరకే మందులు ఇవ్వాలని మెడికల్‌ షాపుల యజమానులకు తెలిపాం. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. మందులు కొనే వారికి తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.
–  డి.సురేష్‌బాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్,జిల్లా ఔషధ నియంత్రణ శాఖ

మరిన్ని వార్తలు