తుది దశకు క్రమబద్ధీకరణ

3 Nov, 2015 04:44 IST|Sakshi

♦ చెల్లింపు కేటగిరీలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి
♦ మిగతా సొమ్ము చెల్లించాలని ఫైనల్ డిమాండ్ నోటీసులు జారీ
♦ డిసెంబర్‌కల్లా వసూళ్లు పూర్తిచేయాలని కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశం
♦ సంక్రాంతికల్లా పట్టాల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తుదిదశకు చేరింది. చెల్లింపు కేటగిరీలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక అన్ని జిల్లాల్లోనూ పూర్తయింది. దీంతో దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్ము పోను, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ లబ్దిదారులకు ఆటో జెనరేటెడ్ డిమాండ్ నోటీసులను రెవెన్యూ శాఖ జారీచేసింది. డిసెంబర్ 31కల్లా ఈ వసూళ్లు పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్) తాజాగా ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారు నిర్ధేశిత ధర చెల్లిస్తే సదరు భూమిని క్రమబద్ధీకరించేందుకు గాను గత డిసెంబరులో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీచేసిన సంగతి విదితమే. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 23,516దరఖాస్తులు అందగా, జీవో 58 కింద ఉచిత కేటగిరీలో వచ్చిన దరఖాస్తుల్లో 21,493 దరఖాస్తులను కూడా చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీ కింద ఉన్న దరఖాస్తుల సంఖ్య 45,009కు చేరింది.

 త్వరలో భూమి హక్కుల బదలాయింపు
 భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారికి నిర్దేశిత ధరను చెల్లించేందుకు ప్రభుత్వం ఐదు సులభ వాయిదాల సదుపాయాన్ని కూడా కల్పించింది. సెప్టెంబర్ 30తో రెండోవాయిదా చెల్లింపు గడువు ముగియగా, కొందరు మూడో వాయిదా సొమ్మును, మరికొందరు ఒకేసారి మొత్తం సొమ్మును కూడా చెల్లించారు. దరఖాస్తులు వివిధ వాయిదాల కింద  ఇప్పటివరకు మొత్తం రూ.141.35 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. ఒకేసారి సొమ్ము చెల్లించిన 409మంది లబ్ధిదారులకు ఈ నెలఖారుకల్లా భూమి హక్కులను బదలాయిస్తామని, ఇందుకోసం రూపొం దించిన కన్వీనియన్స్ డీడ్ నమూనా ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు రెవెన్యూ ఉన్నతాధికారుల చెబుతున్నారు. ఇప్పటికే న్యాయ విభాగం నుంచి క్లియరెన్స్ లభించినందున కన్వీనియన్స్ డీడ్ నమూనాకు ప్రభుత్వ ఆమోదం ఇక లాంఛనమేనంటున్నారు. వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న లబ్ధిదారుల నుంచి డిసెంబరులోగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కల్లా పట్టాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
 
 చెల్లింపు క్రమబద్ధీకరణ తీరు

  వచ్చిన దరఖాస్తులు    23,516
 మార్పిడి దరఖాస్తులు    21,493
 మొత్తం దరఖాస్తులు    45,009
మొదటి వాయిదాలో
 వచ్చిన సొమ్ము    రూ.129.30 కోట్లు
 రెండో వాయిదాలో
 అందిన సొమ్ము    రూ.9.42 కోట్లు
 మూడో వాయిదా
 సొమ్ము    రూ.91.90 లక్షలు
 ఒకేసారి చెల్లించిన
 సొమ్ము    రూ.1.70 కోట్లు
 సర్కారుకు అందిన
 మొత్తం సొమ్ము    రూ.141.35 కోట్లు

మరిన్ని వార్తలు