అయ్యో.. అయ్యన్న!

16 Aug, 2016 01:07 IST|Sakshi
అయ్యో.. అయ్యన్న!
  • సీనియర్‌ నేత సీన్‌ అంతేనా?
  • పతాకావిష్కరణ అవకాశం ఇవ్వని సర్కారు
  • ఇన్‌చార్జి మంత్రిగా పశ్చిమలోనూ చాన్స్‌ లేదు
  • ఇక్కడ మాత్రం ఇన్‌చార్జి మంత్రి యనమలకు అవకాశం
  • మరో మంత్రి గంటాకు కడపలో అవకాశం
  • అయ్యన్నను లెక్క చేయకపోవడంపై టీడీపీ క్యాడర్‌లో నిర్వేదం
  •  
    పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి పరిస్థితి. విశాఖ పోలీస్‌ బ్యారెక్స్‌లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు జాతీయ జెండా ఎగురవేశారు. ఇక మన జిల్లాకే చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు తను ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వైఎస్సార్‌ కడప జిల్లాలో ఆవిష్కరించారు. కానీ మంత్రిగా వారిద్దరి కంటే ఎంతో సీనియర్‌ అయిన అయ్యన్నపాత్రుడు మాత్రం సోమవారం నాటి వేడుకల్లో కేవలం ‘తదితరుల’ జాబితాలోనే ఉండిపోయారు. తను ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలోనూ జెండా ఎగురవేసే భాగ్యం ఆయనకు దక్కలేదు. ఆ జిల్లాకు చెందిన దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(బీజేపీ)కు ఆ బాధ్యత కట్టబెట్టారు. దీంతో అయ్యన్న ఎక్కడా ప్రొటోకాల్‌ హోదాలో జాతీయ జెండా ఎగురవేయని పరిస్థితిపై టీడీపీ శ్రేణుల్లోనూ కాదు.. అధికారవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
     
    సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
    ఆవిర్భావం నుంచి టీడీపీనే అంటిపెట్టుకొని.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అమాత్య పదవి పొందుతున్న సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడుకు ఆ పార్టీలో ఈ మధ్యకాలంలో ప్రాధాన్యం తగ్గుతోందన్న వాదన ఇటీవల పార్టీ శ్రేణుల్లో బలంగా విన్పిస్తోంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాసరావుకు యంత్రాంగంలోనే కాదు పార్టీలో కూడా ప్రాధాన్యం పెరుగుతోందన్న ఆందోళన అయన వర్గీయుల్లో కలవరం రేపుతోంది. ఈ వాదనలకు బలం చేకూరేలా సోమవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో అయ్యన్నను ప్రభుత్వ పెద్దలు కనీసమాత్రంగా కూడా పట్టించుకోకపోవడం చర్చకు దారితీసింది. పార్టీలోనూ.. మంత్రిగా సీనియారిటీలోనూ తమ నాయకుడి కంటే చాలా జూనియర్‌ అయిన గంటాకు ఇచ్చిన ప్రాధాన్యత అయ్యన్నకు ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
     
    గత ఏడాది కూడా అంతే..
    పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో జెండా ఎగురవేసిన అయ్యన్నకు ఆ తర్వాత ఆ అవకాశం దక్కలేదు. గత ఏడాది విశాఖలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగడం.. వాటిలో సీఎం చంద్రబాబు పాల్గొనడంతో అయ్యన్నకు జెండా ఎగరేసే చాన్స్‌ రాలేదు. ఈసారి ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఆవిష్కరిద్దామనుకుంటే.. అక్కడి మంత్రి మాణిక్యాలరావు అడ్డుతగిలారు. దీంతో ఆయన ఒకింత నిస్తేజానికి లోనయ్యారని అంటున్నారు. అందుకే.. సోమవారం విశాఖ నగరంలో జరిగిన వేడుకల్లో మొక్కుబడిగా పాల్గొన్న అయ్యన్న కార్యక్రమం ఆసాంతం ముభావంగానే కనిపించారు. పోలీస్‌ బ్యారెక్స్‌లో జరిగిన వేడుక సభలో పతాకావిష్కరణ, ప్రసంగానికి అవకాశం లేకపోయినా.. కనీసం ప్రశంసాపత్రాలు కూడా అయ్యన్నతో ఇప్పించకపోవడం  చర్చనీయాంశమవుతోంది.
మరిన్ని వార్తలు