రాజధాని ప్రాంతంలో మట్టి, నీరు జల్లిన సీఎం

22 Oct, 2015 00:49 IST|Sakshi
రాజధాని ప్రాంతంలో మట్టి, నీరు జల్లిన సీఎం

మిగిలిన మట్టి, నీటితో 25 ఎకరాల్లో స్మారక కట్టడం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పూజలు చేసి తెచ్చిన మట్టి, నీటిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హెలీకాప్టర్ నుంచి రాజధాని ప్రాంతంలో చల్లారు. శంకుస్థాపన ప్రాంగణంలోనూ వాటిని చల్లారు. హెలీకాప్టర్ నుంచి వీటిని చల్లడానికి వెళ్లేముందు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్న రాజధాని అమరావతిని ప్రపంచంలోనే పది అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భారతదేశంతో పాటు క్రీస్తు జన్మస్థలం జెరూసలెం, మహ్మద్ ప్రవక్త జన్మస్థలం మక్కా, మహాత్మా గాంధీ, నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, భగత్‌సింగ్ వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన ప్రాంతాల నుంచి ఈ మట్టి, నీటిని సేకరించామన్నారు.

అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ ప్రాంగణం, మానససరోవర్, అజ్మీర్ దర్గా, మౌంట్ అబు, తిరుమల బంగారు బావి నుంచి సేకరించిన మట్టి, జలాలను తీసుకొచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 13 వేల గ్రామాల నుంచి మట్టి, జలాలు పూజలు, ప్రార్థనలతో తీసుకువచ్చినట్లు తెలిపారు. వీటన్నింటినీ కలిపి రాజధాని ప్రాంతమంతటా చల్లడం వల్ల ఆయా పవిత్ర స్థలాలు, పుణ్య క్షేత్రాల పవిత్రత అమరావతిపై ఉంటుందని భావిస్తున్నామన్నారు.

ఇలా చల్లగా మిగిలిన, మట్టి, నీటితో 25 ఎకరాల్లో అద్భుతమైన స్మారక కట్టడాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. శంకుస్థాపన పూర్తయిన వెంటనే రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. సమాచార వ్యవస్థను మెరుగుపరుస్తామని, భారీ నిర్మాణాలకు అనువుగా భూమిని పొక్లెయిన్లు, రోలర్లతో చదును చేయిస్తామని సీఎం చెప్పారు.

>
మరిన్ని వార్తలు