విజయదశమి

22 Oct, 2015 01:18 IST|Sakshi
విజయదశమి

ప్రాచీన కాలం భారతీ యులకు ప్రకృతి పట్ల భయ భక్తులూ, ప్రేమాదరాలూ ఎక్కువ. ప్రకృతి మాతకు కృతజ్ఞతలు ప్రకటించడం ధర్మంగా పూర్వులు భావించేవారు. రుతుచక్ర గతిలో తమ చుట్టూ ఉన్న జగత్తు ఎప్పటికప్పుడు కొత్త అందాలతో కనిపిస్తుంటే స్పందించకుండా ఉండ లేకపోయేవారు. వానలు వెనుకబట్టి నదులూ, చెరువులూ, కుంటలూ మళ్లీ జల సంపదతో కళకళలాడుతుంటే; ఆకాశం నిర్మలమై, మళ్లీ పగళ్లు ఎప్పుడూ లేనంత ఆహ్లా దకరంగా కనిపిస్తుంటే పిండారబోసినట్టు ఒప్పే పండు వెన్నెలలతో శారదరాత్రులు మెరిసిపోతుంటే ఆ ఆనం దంలో అప్రయత్నంగా ‘అమ్మ’వారు గుర్తుకొచ్చేది. దానికి తోడు ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాల వల్ల కూడా ఆశ్వయుజ శుక్లపక్షాన్ని పర్వదినాలుగా జరుపు కునే ఆనవాయితీ ఏర్పడింది. శరత్కాలం కనిపించగానే పులకింతతో భారతీయులు తొమ్మిదిరోజులు సుదీర్ఘమైన నవరాత్రి ఉత్సవం జరుపుకుంటారు. అమ్మలగన్న అమ్మను, అన్ని రకాల అలంకారాలతో ఉపచారాలతో ఆరాధించి ఆనందిస్తారు.
 
 అమ్మవారిని ఆరాధించే ఆనవాయితీ శ్రీరామ చంద్రుడి సమయం నుంచి ఉన్నదే. ‘శరదృతువు మొదల యింది. ఆశ్వయుజం ఆరంభమైంది. ఇప్పుడు నువ్వు నవరాత్రి వ్రతం శ్రద్ధగా నిర్వర్తించు. కష్టాలలో ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే శుభం కలుగుతుంది. రావణ వధ కోసం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయాలి. నేనే ఆధ్వర్యం వహించి నీ చేత వ్రతం చేయిస్తాను!’ అని నారదుడు శ్రీరాముడి చేత జగదంబికను ప్రతిష్టింపచేసి ఉపవా సాలూ, నిత్యార్చనలూ, జపాలూ, హోమాలూ యథా విధిగా చేయించగా, అష్టమి నాటి రాత్రి అమ్మవారు ప్రత్య క్షమై ఆశీర్వదించి వెళ్లిందట. దశమి నాడు విజయదశమి పూజ చేసి శ్రీరా ముడు యుద్ధయాత్ర ఆరంభించి దిగ్వి జయం సాధించాడు.
 
 వరాల బలంతో అహంకరించి, అన్ని రకాల దుష్కృత్యాలకు ఒడిగడుతూ త్రిమూర్తులను కూడా ధిక్కరించి గెలిచి నిలిచిన మహిషాసురుడిని సకల దేవతా తేజో స్వరూ పిణిగా అవతరించిన జగన్మాత మట్టుపెట్టిన మంచిరోజు విజయదశమి. సాధు రక్షణ కోసం, ‘అజన్మ’ అయిన జగ న్మాత జన్మనెత్తడం,‘అరూప’ అయిన తల్లి మహిషా సుర మర్దని రూపం దాల్చ డం మహాద్భుత లీల.
 
 దేవీనవరాత్రులను వంగదేశీయులు వైభవంగా జరుపుకుం టారు. తమ ఇంటి ఆడ పడుచు దుర్గాదేవి ఏడాదంతా రాతి గుండె భర్తతో అష్టకష్టాల కాపురంచేసి నాలుగు రోజులు ఉండి వెళ్లడానికి పుట్టిం టికి వస్తుందని వారు భావిస్తారు. షష్ఠీ, సప్తమీ, అష్టమీ, నవమీ వారితో గడిపి, విజయదశమికి మెట్టినింటికి వెళ్లి పోతుంది. ఆడ పడుచు ఉన్న నాలుగు రోజులూ గొప్ప సంబరం. విజయ దశమినాడు కన్నీరు కారుస్తూ ఆమెకు వీడ్కోలు చెబుతారు. అక్షయ తృతీయలాగా విజయదశమి కూడా అన్ని శుభకార్యాల ఆరంభానికి (ప్రధానంగా అక్ష రాభ్యా సానికి) అనువైన పెట్టని ముహూర్తం.
 యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
 నమః తస్యై, నమః తస్యై, నమః తస్యై, నమో నమః!
 - ఎం. మారుతిశాస్త్రి
 

మరిన్ని వార్తలు