అప్పాజిపేటలో అతి ఎత్తయిన స్మారక శిల

6 Jul, 2016 00:43 IST|Sakshi
అప్పాజిపేటలో అతి ఎత్తయిన స్మారక శిల

- 30 అడుగుల ఎత్తయిన శిలాయుగ
- సమాధిని గుర్తించిన పురావస్తుశాఖ
- నాటి తెగలకు చెందిన నాయకుడి సమాధిగా అంచనా
- తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద స్మారక శిలా సమాధి
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దాగి ఉన్న చారిత్రక సంపద అవశేషాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల తిప్పర్తి మండలం పజ్జూరు -ఎర్రగడ్డల గూడెం శివార్లలో ఆదిమానవుల పెద్ద సమాధిని చరిత్రకారులు వెలికి తీయగా, తాజాగా నల్లగొండ రూరల్ మండ లం అప్పాజిపేటలో కూడా అతిపెద్ద స్మారకశిలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. బృహత్‌కాల యుగం లో జీవించిన మానవుల సమాధుల్లో ఒక రకమైన స్మారక శిలా సమాధి ఇంత ఎత్తులో గుర్తించడం ఇదే ప్రథమమని   అధికారులు చెబుతున్నారు. ఈ అతి ఎత్తై స్మారక శిలతో పాటు 50-70 వర్తులాకార సమాధులు, పరుపు బండ, సానబండ గుంతలు కూడా గుర్తించారు. వీటితో పాటు లింగాలపాడు అనే ప్రదేశంలో తొలి చారిత్రక యుగం నాటి అవశేషాలను కూడా వెలికితీయడం గమనార్హం.

 30 అడుగుల ఎత్తులో : వాస్తవానికి బృహత్ కాలయుగం (క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 200 సంవత్సరం వరకు)లో వర్తులాకార, స్మారక శిల, గూడు, గుంత, రాతి గుహ సమాధులు ఉండేవి. ఈ ఐదింటిలో రెండు రకాలను నల్లగొండ మండలం అప్పాజీపేట, లింగాలపాడుల్లో గుర్తించారు. మంగళవారం అప్పాజిపేటలో పురావస్తు శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు పరిశోధించగా దాదాపు 30 అడుగుల ఎత్తు, మీటరు వెడల్పు ఉన్న స్మారక శిల కింద  సమాధి  వెలుగుచూసింది. ఇది అప్పటి తెగ నాయకుడిది అయి ఉంటుందని పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంత పెద్ద ఏకరాతి శిలను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేదని వారంటుండడం విశేషం.

 చారిత్రక అవశేషాలు కూడా : ఈ స్మారక శిల లభించిన చోటు నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న లింగాలపాడులో తొలిచారిత్రక యుగం నాటి అవశేషాలు లభించాయి. పలు రంగుల్లో ఉన్న పెంకులను కూడా పురావస్తు అధికారులు గుర్తించారు. అక్కడే ఆనాటి ప్రజలు ఆడుకునేందుకు ఉపయోగించిన తొక్కుడు బిళ్లలు, పెద్ద పెద్ద ఇటుక ముక్కలు కూడా లభ్యమయ్యాయి. ఇవన్నీ క్రీస్తు శకం 1 నుంచి 4-5 శతాబ్దాలకు చెందినవి అయి ఉంటాయని, ఈ ఆధారాలు, విశేషాలను బట్టి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మానవ సమూహం అప్పట్లో నివసించి ఉంటారని అర్థమవుతోందని పురావస్తు అధికారులు చెపుతున్నారు. లింగాలపాడుకు అరకిలోమీటర్ దూరంలో సర్వే నం 170, 171, 172లలో ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ శిలా యుగానికే చెందిన వర్తులాకార సమాధులు కూడా లభించాయి.
 
 తవ్వకాలకు అనుమతి కోరుతాం
 ‘ఇలాంటి చారిత్రక సంపదను పదిలపర్చుకోకపోతే భవిష్యత్‌తరాలు నష్టపోతాయి. అందుకే అప్పాజీపేట సమీపంలో గుర్తించినవాటి గురించి ప్రభుత్వానికి తెలియజేస్తాం. తవ్వకాలు జరిపితే తొలి చారిత్రక యుగ అవ శేషాలు, విశేషాలు వెలుగులోనికి వస్తాయి. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తాం.’    
 - పగడం నాగరాజు, పురావస్తు శాఖ ఏడీ

>
మరిన్ని వార్తలు