కబ్జాలకు మారుపేరే ‘పరిటాల’

9 May, 2017 22:58 IST|Sakshi
కబ్జాలకు మారుపేరే ‘పరిటాల’

– ఓనామాలు రాని మంత్రిని బర్తరఫ్‌ చేయాలి
– రాప్తాడు సమన్వయకర్తి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌

అనంతపురం రూరల్‌ : బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను కబ్జాచేయడంతో పాటు అధికారులను భయపెడుతూ అనంతపురం చుట్టూ అత్యంత విలువైన భూములను ఆక్రమిస్తూ పరిటాల కుటుంబం కబ్జాలకు మారుపేరుగా నిలుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పుట్టిపెరిగిన అనేక మంది అనంతపురం జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తూంటే మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ దాన్ని చెడగొడుతున్నాడన్నారు.

విజయవాడ గవర్నర్‌ పేటలోని అత్యంత విలువైన రెండతస్తుల భవనాన్ని అతని ముఖ్య అనుచరుడైన కనగానపల్లి మండలం పాతపాలెంకు చెందిన పూజారి వేణుగోపాల్‌ అనే వ్యక్తి పేరు మీద విక్రయ డాక్యుమెంట్‌ సృష్టించి దందా చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు ఖాళీ చేయకుంటే చస్తారు? నేను ఎవరో తెలుసా పరిటాల శ్రీరామ్‌ అనుచరుడినంటూ ఇంటి యజమాని మల్లికార్జునను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఇదే విషయంపై అక్కడి పోలీసు స్టేషన్‌లో కేసు సైతం నమోదైందన్నారు. ఓనమాలు కూడా రాని మంత్రి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆడిస్తూ తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారని విమర్శించారు. 4వ పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శివశంకర్‌ను వీఆర్‌కు పంపడంతో పాటు ఏఎస్సై సస్పెండ్‌ వెనుక మంత్రి అనుచరుల ఓ భూ వివాదమే కారణమన్నారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కనకసింహన్‌ ఆత్మహత్య వెనుక సైతం మంత్రి పరిటాల సునీత వేధింపులే కారణమని మృతుని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గూ లజ్జా ఉంటే వెంటనే సునీతను మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేసి , భూ దందాపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్యయాదవ్,  జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వెన్నపూస రవీంద్రారెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, రాష్ట్ర నాయకులు సురేష్‌గౌడ్, మహానందరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి బిల్లే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు