సమరానికి నేడే ప్రారంభం

20 Feb, 2017 23:50 IST|Sakshi
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్‌
28 వరకూ నామినేషన్ల స్వీకరణ
కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మంగళవారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఈ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆ క్షణం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 28వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. సెలవు రోజులు (ఈ నెల 24, 26) మినహా ప్రతి రోజూ కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30 సంవత్సరాల వయస్సు ఉండి ఏ జిల్లాకు చెందినవారయినా నామినేషన్‌ వేయవచ్చు. కానీ ఆ వ్యక్తిని ప్రతిపాదించే 10 మంది జిల్లాలోని శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఓటర్లుగా నమోదై ఉండాలి. జిల్లా రెవెన్యూ అధికారి చెన్నకేశవరావు సహాయ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు.
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. దీని ప్రకారం శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, నగర పాలక సంస్థల కార్పొరేటర్లు, నగర పంచాయతీ వార్డు సభ్యులతోపాటు పట్టణ, నగరాల్లో ఓటరై ఎక్స్‌ అఫీషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 1,476 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 631, మహిళలు 845 మంది ఉన్నారు. రంపచోడవరం డివిజన్‌లో 66 మంది, పెద్దాపురంలో 317, రాజమహేంద్రవరంలో 185, రామచంద్రపురంలో 221, అమలాపురంలో 385, కాకినాడలో 261, ఎటపాక డివిజన్‌లో 41 మంది ఓటర్లున్నారు.
24 వరకూ అభ్యంతరాల స్వీకరణ
ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, సవరణలు ఉంటే ఈ నెల 24వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు అందజేయాలి. పరిశీలన నిమిత్తం ఈ ఓటర్ల జాబితాలను కలెక్టరేట్, జిల్లా పరిషత్‌ సీఈఓ కార్యాలయం, రాజమహేంద్రవరం కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ కార్యాలయాలతోపాటు ఆర్‌డీఓ, ఎంపీడీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. నిర్దేశించిన తేదీలోపు వచ్చిన అభ్యంతరాలు, సవరణలను ఈ నెల 26 లోపు పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తారు.
పోలింగ్‌ కేంద్రాలు ఇవే
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు జిల్లాలోని ఏడు రెవెన్యూ డివిజన్లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అమలాపురం ఆర్‌డీఓ కార్యాలయం; కాకినాడ అర్బన్‌, పెద్దాపురం, రంపచోడవరం, ఎటపాక తహసీల్దార్‌ కార్యాలయాలు; రామచంద్రపురం, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుకుంపేటలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 
మరిన్ని వార్తలు