రేపటి నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

6 Jun, 2017 23:07 IST|Sakshi
 జిల్లాలో నాలుగు హెల్ప్‌లైను కేంద్రాలు
రిజిస్ట్రేషన్‌ ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి
రాజమహేంద్రవరం రూరల్‌: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం గురువారం నుంచి ఈ నెల 22 వరకు ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు బొమ్మూరు జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వి.నాగేశ్వరరావు  తెలిపారు. కాకినాడలో ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ మహిళా కళాశాల, జేఎన్‌టీయూ, బొమ్మూరులోని జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారన్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని, అభ్యర్థులు ముందుగానే హెల్ప్‌లైను సెంటరుకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఏపీ ఎంసెట్‌ ర్యాంకు కార్డు, ఏపీ ఎంసెట్‌ హాల్‌ టిక్కెట్టు, ఇంటర్మీడియట్‌ మార్కుల జాబితా, పాస్‌ సర్టిఫికెట్, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్టు, ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్, విద్యాసంస్థలో చదవని వారు పదేళ్ల రెసిడెన్స్‌ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువ పత్రం, ఆధార్‌ కార్డు, కుల ధ్రువీ కరణపత్రం ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్టీ రిజర్వేషన్‌ కల్గిన అభ్యర్థుకు కాకినాడలో ఆంధ్రాపాలిటెక్నిక్‌ కళాశాలలో మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారన్నారు.
రిజిస్ట్రేషన్‌ ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి..
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.1200 రిజిస్ట్రేషన్‌ ఫీజు ముందుగానే ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ఏనీఈఎఎంసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్, ద్వారా ఫీజు చెల్లించవచ్చని సూచించారు. హెల్ప్‌ లైన్‌ సెంటర్లలో నగదు తీసుకోరని, అందుకు ముందుగానే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పీజులు చెల్లించి సంబంధిత రశీదును ఆయా హెల్ప్‌లైన్‌సెంటర్లలో అధికారులకు చూపించాలని కోరారు.
సర్టిఫికెట్లు పరిశీలన తేదీలు ఇవే
తేదీ                  ర్యాంకులు
08.06.17         1–8000
09.06.17        8001–16,000
10.06.17        16001–30,000
11.06.17        30,001–45,000
12.06.17   45,001–60,000
13.06.17   60,001–78,000
14.06.17   78,001–95,000
15.06.17   95,001–1,15,000
16.06.17   1,15,001– 1,30,000
17.06.17    1,30,001–చివరిర్యాంకు వరకు
ఆప్షన్లు నమోదు తేదీలు ఇవే
అభ్యర్ధులు సర్టిఫికెట్లు పరిశీలన అనంతరం తమకు కావాలసిన కోర్సులను, కళాశాలలను ఎంపికచేసుకోవాలి. సంబంధిత తేదీలలో హెల్ప్‌లైన్‌సెంటర్‌లలో లేక స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
తేదీలు                 ర్యాంకులు
జూన్‌ 11,12         1–30,000
జూన్‌ 13,14       30,001–60,000
జూన్‌ 15,16       60,001–90,000
జూన్‌ 17,18       90,001–1,20,000
జూన్‌ 19,20      1,20,001–చివరి ర్యాంకు వరకు
జూన్‌ 21, 22    ఆప్షన్లు నమోదులో మార్పులకు అవకాశం
జూన్‌ 25         సీట్లు కేటాయింపు  
>
మరిన్ని వార్తలు