విద్యుత్‌ స్తంభంను ఢీకొన్న రైలు

22 Dec, 2016 01:52 IST|Sakshi
విద్యుత్‌ స్తంభంను ఢీకొన్న రైలు
 • తెగిపడిన విద్యుత్‌ తీగలు
 •  రైళ్ల రాకపోకలకు ఆలస్యం  
 • వెంకటాచలం : గూడ్సు రైలుపై ఉన్న యుద్ధ యంత్రం తగిలి విద్యుత్‌ స్తంభం వాలిపోయి తీగలు తెగిపడిన సంఘటన వెంకటాచలం రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగింది. దీంతో దిగువ మార్గం (విజయవాడ వైపు) వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు యుద్ధ యంత్రాలతో గూడ్సు రైలు వెళ్తుంది. తెల్లవారు జామున 4.30 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు సమీపానికి వచ్చేసరికి యుద్ధ యంత్రం రైలు పట్టాల పక్కన ఉన్న ఓ విద్యుత్‌ స్తంభానికి తగలడంతో స్తంభం ఒరిగిపోయి విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన రైల్వేస్టేషన్‌ అధికారులు  సమాచారమందించారు. దీంతో ఓహెచ్‌ఈ సిబ్బంది అక్కడకు చేరుకుని విద్యుత్‌ సరఫరాను పూర్తిగా నిలిపి వేసి మరమ్మతులు చేశారు. ఉదయం 6.30 గంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ఈ మార్గంలో తిరుపతి–కాకినాడ ప్యాసింజర్, యశ్వంత్‌పూర్, కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో వెంకటాచలం స్టేషన్‌లో ఆగిపోయిన యుద్ధ యంత్రాలతో వెళ్లే గూడ్సు రైలు పనులు పూర్తిచేసిన తరువాత వెళ్లింది.
   
   
   
   
మరిన్ని వార్తలు