దేవాదాయ భూముల్లో కదం తొక్కిన ఆదివాసీలు

21 Jul, 2016 23:11 IST|Sakshi
గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న మాగాణి భూముల్లో వరినాట్లు వేస్తున్న ఆదివాసీలు
  • గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న 600 ఎకరాలు స్వాధీనం
  • మాగాణి భూముల్లో సామూహిక వరినాట్లు
  • చండ్రుగొండ : మండలంలోని అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామికి ఆగ్రహారంగా ఉన్న 600 ఎకరాల వ్యవసాయ భూములను ఆదివాసీలు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ 600 ఎకరాల భూములను గిరిజనేతర రైతులు కౌలు సేద్యం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా గిరిజనేతరులు సేద్యం చేస్తున్న భూములకు ఇటీవల దేవాదాయశాఖ అధికారులు కౌలు టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో ఈ భూములు తమకే చెందుతాయని ఆదివాసీ సేన నాయకులు చెబుతున్నారు. తాజాగా సుమారు 200 మంది ఆదివాసీలు అరకలతో కదం తొక్కారు. గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న 600 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆదివాసీ సేన డివిజన్‌ కార్యదర్శి ఊకే ముక్తేశ్వరరావు ప్రకటించారు. అందులో కొంత మాగాణి భూముల్లో అరకలతో దుక్కిదున్ని వరినాట్లు వేశారు. దేవాలయ అధికారుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆదివాసీలను వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చట్ట ప్రకారం ఈ భూములు తమకే చెందుతాయని వారు చెబుతున్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సేన నాయకులు సున్నం పెద్దిరాజు, సున్నం చినరాజు, ఊకే నర్సింహారావు, సున్నం పెద్దవెంకటేశ్వర్లు, సున్నం ముత్యాలు, ఊకే భద్రయ్య, చలమయ్య, పెద్దులు, సమ్ములుతోపాటు 200 మంది ఆదివాసీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు