ఇందిరమ్మ సేవలు ఎనలేనివి

19 Nov, 2016 20:54 IST|Sakshi
ఇందిరమ్మ సేవలు ఎనలేనివి

విజయవాడ సెంట్రల్‌ : మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ 99వ జయంతిని ఆంధ్రరత్న భవన్‌ శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, నగర నాయకులు ఇందిరగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌ రాజా మాట్లాడుతూ గరీబీ హఠావో నినాదంతో నిరుపేదల గుండెల్లో ఇందిరమ్మ సజీవంగా ఉన్నారన్నారు. దేశంలో హరిత విప్లవానికి నాందిపలికిన ఉక్కు మహిళ అని చెప్పారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పెద్దనోట్ల వంటి అర్ధరహిత నిర్ణయాలతో నిరుపేదల గుండెల్లో గునపాలు గుచ్చిందని విమర్శించారు. సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లాది విష్ణు మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సెక్యులర్‌ భావాలతో ఆమె  పాలన సాగించారన్నారు. ఇందిరమ్మ త్యాగాలు, పాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ అణగారిన కులాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందన్నారు. తొలుత సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చల్లపల్లి బంగ్లా సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపార్టీ నాయకులు మీసాల రాజేశ్వరావు, ఆకుల శ్రీనివాస్‌ కుమార్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






 

>
మరిన్ని వార్తలు