పారిశుద్ధ్య నిధులు సక్రమంగా వినియోగించాలి

7 Sep, 2016 23:02 IST|Sakshi
collector
ఒంగోలు: గ్రామ పంచాయతీలకు కేటాయించిన పారిశుద్ధ్య నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సుజాతశర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అ«ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 9వ తేదీ సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లను భాగస్వాములను చేయాలని సూచించారు.
 
పారిశుధ్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని దండోరా వేయించి ప్రజలకు  తెలిసే విధంగా చూడాలన్నారు. రక్షిత మంచినీటి పథకాలు, ఇతర మంచినీటి పథకాలను పరిశుభ్రపరచి క్లోరినేషన్‌ చేసి ఆ వివరాలను బోర్డులో నమోదు చేయాలన్నారు. ప్రతినెలా మొదటి, మూడో శనివారాలు తప్పనిసరిగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు శుభ్రపరచి క్లోరినేషన్‌ చేపట్టాలన్నారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న అసెంబ్లీ కార్యక్రమాల్లో స్వచ్ఛభారత్, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 
 
విద్యార్థుల హెల్త్‌ కార్డులు చెక్‌ చేయాలి 
పాఠశాలలను అధికారులు తనిఖీ చేసే సమయంలో విద్యార్థులకు సంబంధించిన హెల్త్‌ కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైద్యాధికారులు మూడు నెలలకు ఒకసారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన వివరాలను హెల్త్‌ కార్డుల్లో నమోదు చేయాలన్నారు. మేజర్‌ పంచాయతీల్లో ప్రతి షాపు ముందు తప్పనిసరిగా డస్ట్‌ బిన్‌ ఏర్పాటు చేసుకోవాలని, డస్ట్‌ బిన్‌లు లేకుంటే పెనాల్టీ విధించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌–2 ఐ.ప్రకాష్‌కుమార్, భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ సుదర్శనం, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డీపీఓ ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, డీఈఓ సుప్రకాష్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కాంతనాథ్, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డాక్టర్‌ బి.రవి, డీఎంహెచ్‌ఓ యాస్మిన్, ఒంగోలు ఆర్‌డీఓ కె.శ్రీనివాసరావు, ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రమీల పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు