పోలో వీరుడు..

8 Feb, 2017 22:41 IST|Sakshi
పోలో వీరుడు..
పిసాపోలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరగంగాధర్‌
తునిరూరల్‌ (తుని) : ప్రోత్సహం లభించడంతో.. క్రీడల్లో అసమాన ప్రతిభతో మట్టిలో ఒక మాణిక్యం దేదీప్యమానంగా వెలిగింది. మండలంలోని శివారు గ్రామం ఎన్‌.ఎస్‌.వెంకటనగరానికి చెందిన కొల్లు వీరగంగాధర్‌ పిసాపోలో క్రీడలో జాతీయ స్థాయిలో కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఫిన్‌లాండ్‌ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పిసాపోలో పోటీల్లో ఈతడు పాల్గొననున్నాడు. ఆ పోటీల్లో కూడా ప్రతిభ చూపి దేశం, రాష్ట్రం, గ్రామానికి ఖ్యాతి తెస్తానంటున్నాడు. రెండు నెలల్లోనే అత్యుత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానాన్ని పొందిన ఈతడు.. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. వ్యయసాయ కుటుంబంలో పుట్టిన వీరగంగాధర్‌కు ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సహం లభించింది. కబడ్డీ, లాంగ్‌ జంప్, చౌక్‌బాల్‌ పోటీల్లో ఇతడు రాణిస్తున్నాడు. 
పదో తరగతి పరీక్షల కోసం..
ప్రస్తుతం ఇతడు ఎన్‌.సూరవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఫిన్‌లాండ్‌ దేశంలో ప్రసిద్ధి కెక్కిన పిసాపోలో క్రీడలో ఇతడికి పీఈటీలు రాజు, విక్టర్‌ శిక్షణ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయిలో గత జనవరిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో  సిల్వర్‌ ట్రోఫీ, మెరిట్‌ సర్టిఫికెట్‌ను సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.
ఒలింపిక్స్‌లో ఆడడమే ధ్యేయం
2020లో పిసాపోలో ఒలింపిక్స్‌ క్రీడల్లో చేర్చే అవకాశం ఉన్నట్టు సెలక్టర్లు తెలిపారని, అందులోనూ పాల్గొని విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వీరగంగాధర్‌ తెలిపారు. మంగళవారం నుంచి 15వ తేదీ వరకూ రాజస్థాన్‌లో నేషనల్‌ అకాడమీ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఇతడు పాల్గొనాల్సి ఉంది. అయితే పదో తరగతి పరీక్షలు సమీపించడంతో శిక్షణకు వెళ్లలేదు. ఈ విషయాన్ని పీఈటీల ద్వారా సెలక్టర్లకు తెలియజేస్తే.. మేలో జరిగే మూడో విడత శిక్షణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ ఆటలో తొమ్మిది మంది ఆటగాళ్లు, ఇద్దరు అదనపు ఆటగాళ్లు ఉంటారన్నారు. జట్టులో రెండో స్థానంలో ఉన్నానన్నాడు. ఫిన్‌లాండ్‌ వెళ్లేందుకు పాస్‌పోర్టు, ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వెళ్లాలంటే రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, ఇందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకరిస్తున్నారని చెప్పాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొని గుర్తింపు తీసుకువస్తానని ఇతడు అంటున్నాడు. 
మరిన్ని వార్తలు