సాఫ్ట్‌వేర్‌ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!

12 Sep, 2023 09:29 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ చిన్నారిప్రపంచమంతా టెక్నాలజీతోపాటు పరుగులు పెడుతోంది. అందుకే చిన్నా..పెద్దా తేడా లేకుండా అంతా స్మార్ట్‌ ఫోన్ల నుంచి కంప్యూటర్ల దాకా అన్నీ అవలీలగా వాడేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కోడింగ్‌ ద్వారా వివిధ రకాల అప్లికేషన్లు, గేమ్‌లు తయారు చేస్తుంటారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలో కొంతమంది మాత్రమే వీటిని తయారు చేయగలరు. మిగతావారికి కోడింగ్‌ అంటే అర్థం కాని పెద్ద సబ్జెక్ట్‌గా చూస్తారు. అటువంటిది భారత సంతతికి చెందిన సీమర్‌ ఖురానా కోడింగ్‌ను మునివేళ్లతో పట్టి చకచక వీడియోగేమ్‌ను రూపొందించింది. అతిపిన్నవయసులో వీడియోగేమ్‌ రూపొందించి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన వీడియోగేమ్‌ డెవలపర్‌గా గిన్నిస్‌ రికార్డుల్లో నిలిచింది.

కెనడాలోని ఆంటారియోలో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన పరాస్‌ ఖురానా కూతురే సీమర్‌. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండే సీమర్‌ తన వయసు పిల్లలంతా వీడియోగేమ్‌లు ఆడుకుంటుంటే సీమర్‌ మాత్రం... తన సీనియర్లు చదివే పాఠాలు నేర్చుకోవడానికి ఆరాటపడేది. మ్యాథ్స్‌ అంటే మక్కువ ఎక్కువ ఉన్న సీమర్‌.. తన తరగతి కాకుండా పైతరగతి విద్యార్థులు చదివే లెక్కల పాఠాలు నేర్చుకోవాలనుకునేది. కానీ ఎవరూ నేర్పించేవాళ్లు కాదు.

దీంతో యూట్యూబ్‌లో చూసి లెక్కలు నేర్చుకునేది. కిండర్‌ గార్డెన్‌ చదివే సీమర్‌ మూడోతరగతి లెక్కలు సులభంగా చేసేది. ఒకపక్క లెక్కలు చెబుతూనే కాగితాలతో క్రాఫ్ట్‌ తయారు చేసి ఆడుకుంటూ ఉండేది. ఇది గమనించిన సీమర్‌ తండ్రి కోడింగ్‌ క్లాసులను చూపించారు. కోడింగ్‌ నచ్చడంతో సీమర్‌ కోడింగ్‌ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. క్రమంగా కోడింగ్‌పై పట్టుసాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది.

డాక్టర్‌ మాటలు విని...
సీమర్‌ అక్క ఆరోగ్యం పాడవడంతో ఫ్యామిలీ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కను పరీక్షించిన డాక్టర్‌ జంక్‌ఫుడ్‌ని మానేయాలని చెప్పడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే హెల్దీ, జంక్‌ఫుడ్‌ల గురించి వీడియో గేమ్‌ తయారు చేయాలనుకుంది. దీనికోసం వారానికి మూడు క్లాసులకు హాజరవుతూ ఏడాదిలోపే కోడింగ్‌ను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఆ తరువాత ‘హెల్దీఫుడ్‌ ఛాలెంజ్‌’ పేరిట వీడియో గేమ్‌ను తయారు చేసింది. జంక్‌ ఫుడ్‌ వల్ల ఏర్పడే ముప్పు, ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం ఎలా తీసుకోవాలో ఈ వీడియోగేమ్‌ వివరంగా చెబుతుంది. ఈ యాప్‌ను తయారు చేయడానికి స్కూలు అయిపోయిన తరువాత రోజుకి రెండు గంటలపాటు సమయాన్ని కేటాయించేది సీమర్‌. ఇలా తన పేరుని గిన్నిస్‌బుక్‌లో ఎక్కించుకుంది. 

వీడియో గేమ్‌లే కాదు...
లెక్కలు, కోడింగ్‌తోపాటు డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, కరాటేలు కూడా నేర్చుకుంటోంది.‘సీమర్స్‌ వరల్డ్‌’ పేరుమీద యూ ట్యూబ్‌ ఛానల్‌ నడుపుతూ తనకొచ్చే వివిధ రకాల ఆటల ఐడియాలను షేర్‌ చేస్తోంది. టాలెంట్‌కు వయసుతో సంబంధంలేదనడానికి సిసలైన ఉదాహరణగా నిలుస్తోంది సీమర్‌. చిచ్చర పిడుగుల్లాంటి పిల్లలు వయసు కంటే పెద్ద చదువులు చకచకా చదివేసి, డిగ్రీ పట్టాలు పొందేస్తుంటారు. అయితే అంతకన్నా చకచకా  అడుగులు వేసింది సీమర్‌. డిగ్రీలు చదవడం కాదు... ఏకంగా   వీడియో గేమ్‌నే రూపొందించింది ఈ ఆరేళ్ల సిసింద్రీ సీమర్‌ ఖురానా. 

(చదవండి: ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్‌'! కానీ ఆ వ్యక్తి..)

మరిన్ని వార్తలు