‘వెన్నపూస’ విజయకేతనం

22 Mar, 2017 22:20 IST|Sakshi
‘వెన్నపూస’ విజయకేతనం
మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయం
- వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టిన ఓటర్లు
– ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ను మించి 223 ఓట్ల ఆధిక్యత
 
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పట్టభద్రులు ‘ఓటెత్తిన’ చైతన్యంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ నుంచి ఆధిక్యత ప్రదర్శించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. కౌంటింగ్‌ ఈ నెల 20న మొదలైంది. ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ 67,887 కాగా.. గోపాల్‌రెడ్డి 68,110 ఓట్లను దక్కించుకున్నారు. 223 ఓట్లు ఎక్కువ లభించడంతో ఎన్నికల అధికారులు గోపాల్‌రెడ్డి విజయాన్ని ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు బలమైన జిల్లాగా భావిస్తున్న అనంతపురం నుంచి, అందులోనూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడం చూస్తే ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లావాసుల్లో టీడీపీపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో వైఎస్సార్‌సీపీపై గట్టి నమ్మకం ఉంచారనే విషయాన్ని ఈ ఎన్నికలు సుస్పష్టం చేస్తున్నాయి. 
 
జిల్లా వ్యాప్తంగా సంబరాలు
గోపాల్‌రెడ్డి గెలిచినట్లు బుధవారం ఉదయం ఆరు గంటలకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి కోన శశిధర్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత పార్టీ నేతలంతా ఆనందోత్సాహాల మధ్య గోపాల్‌రెడ్డిని భుజాలపై ఎత్తుకుని ర్యాలీగా బయటకు వచ్చారు. ‘జై జగన్‌’.. ‘జోహార్‌ వైఎస్సార్‌’ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. అక్కడి నుంచి ర్యాలీగా వైఎస్సార్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయానికి వెళ్లి సంబరాలు చేసుకున్నారు.
 
మరిన్ని వార్తలు