విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం

4 Sep, 2016 18:37 IST|Sakshi
చింతలపూడి: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉన్నత విద్య చదవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేని వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌ ద్వారా వివిధ బ్యాంకుల్లో రుణం కోసం ఒకే దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. గతేడాది ఆగస్టులో ఐదు బ్యాంకులతో ప్రారంభమైన పథకం ప్రస్తుతం  37 బ్యాంకులకు విస్తరించింది. 42 రకాల విద్యా రుణాలను పథకంలో భాగంగా అందిస్తున్నారు. విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వార విద్యా రుణం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేయడం వల్ల అర్హులైన విద్యార్థులు సులభంగా రుణాలు పొందగలుగుతున్నారు.  
పథకం లక్ష్యం
విద్యార్థులకు సులభంగా విద్యారుణాలు అందించి వారిని ఉన్నత విద్యకు ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఒకే దరఖాస్తుతో ఎన్ని బ్యాంకులనైనా సంప్రదించవచ్చు. విద్యార్థి పూర్తి వివరాలతో రిజిస్టర్‌ చేసుకుంటే ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మెయిల్స్‌ ద్వార రుణాల ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 
నిబంధనలు ఇలా.. 
బ్యాంకు నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ వద్దనున్న అర్హత, ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.  కళాశాల స్థాయిలో విద్యార్థి చివరిసారి ఉత్తీర్ణత సాధించిన మార్కుల జాబితా జెరాక్స్‌ పత్రాలు సమర్పించాలి. 
–గతంలో ఉపకార వేతనాలు పొంది ఉంటే వాటి పత్రాలు, విద్యాసంస్థ వివరాలు, చదివిన కోర్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశ అర్హతకు సంబంధించిన ర్యాంక్‌ కార్డు, ప్రవేశ పత్రం ఉండాలి. 
–కోర్సు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చుల వివరాలను పొందుపరచాలి. విద్యార్థి తల్లిదండ్రులు, సంరక్షకుల పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఉండాలి.తల్లి, తండ్రీ ఉద్యోగులైతే వారి వేతన ధ్రువీకరణ పత్రం, ఆదాయ పన్ను చెల్లింపు పత్రాలు, ఆరు నెలల బ్యాంక్‌ ఖాతా స్టేట్‌మెంట్లు సమర్పించాలి. హామీగా సమర్పించే ఆస్తి పత్రాలు, నివాస ధ్రువీకరణ తెలిపే ఓటరు ఐడీ,ఆధార్, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్సుల్లో ఏౖÐð నా రెండు గుర్తింపు కార్డులు ఉండాలి. 
దరఖాస్తు చేసే విధానం
ఇంటర్‌ నెట్‌లో (https://www.vidyalakshmi.co.in ) విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌ తెరిచాక ముందు పేజీలో మూడు ప్రధాన బాక్స్‌లు కనిపిస్తాయి. తొలుత రిజిస్టర్‌ బాక్స్‌ను క్లిక్‌ చేస్తే దరఖాస్తు ఫారం వస్తుంది. దీనిలో పేరు, ఫోన్‌ నెంబర్, ఈ మెయిల్‌ ఐడీ వంటి వివరాలు నమోదు చేస్తే యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ వస్తుంది. తర్వాత రెండో బాక్స్‌ క్లిక్‌చేసి అడిగిన వివరాలను నమోదు చేయాలి. అనంతరం మూడో బాక్స్‌ను క్లిక్‌ చేయడం ద్వారా విద్యాలక్ష్మి పోర్టల్‌కు అనుసంధానమై బ్యాంకులను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేయాలి.
 
>
మరిన్ని వార్తలు