యాజమాన్య కమిటీ వైఫల్యంతోనే నీటి ఎద్దడి

18 Aug, 2016 23:12 IST|Sakshi
యాజమాన్య కమిటీ వైఫల్యంతోనే నీటి ఎద్దడి
  • రైతుల పట్ల పాలకులకు కొరవడిన చిత్తశుద్ధి
  • వైఎస్సార్‌ సీపీ జిల్లాఅధ్యక్షుడు కన్నబాబు
  • కరప మండలంలో కాలువలు, చేల పరిశీలన
  •  
    విజయరాయుడుపాలెం(కరప): 
    నీటి యాజమాన్య కమిటీ వైఫల్యం వల్లే కరప మండలంలో సాగునీటి సమస్య ఎదురైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. మండలంలోని విజయరాయుడుపాలెం, పెద్దాపురప్పాడు గ్రామాల్లో గురువారం ఆయన రైతులతో కలసి పంటపొలాలను, కాలువలను పరిశీలించారు. కాలువల్లో నీటిమట్టం పెరిగినా పంటపొలాలు తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీటి ఎద్దడి రాగా ఎప్పటికప్పుడు ఇరిగేషన్‌ అధికారులతో చర్చించి, సాగునీరందించేందుకు చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు పట్టించుకునేవారే లే’రని వాపోయారు. ఆందోళన పడవద్దని, పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు ఇరిగేషన్‌ అధికారులతో సంప్రదిస్తానని  కన్నబాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గోదావరిలో పుష్కలంగా నీరున్నా ఇక్కడ సాగునీటి ఎద్దడి ఏమిటని ప్రశ్నించారు. నేటి పాలకుల్లో రైతుల పట్ల చిత్తశుద్ధి కొరవడిందన్నారు. నీటి యాజమాన్య కమిటీ వైఫల్యంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కనబడుతోందన్నారు. కాలువలోకి వచ్చిననీరంతా కిందకే పోతోందని, డీపీలు మూయించి వేసి, రాత్రి సమయంలో కాపలా పెట్టించాలని, అప్పుడే పంటపొలాలు తడుస్తాయని రైతులు తెలిపారు. ఇరిగేషన్‌ ఈఈ అప్పలనాయుడుతో సంప్రదించి, నీరొచ్చేలా చర్యలు తీసుకోమని కోరినట్టు కన్నబాబు తెలిపారు. కాపవరం వంతెనవద్ద సెంట్రింగ్‌ తొలగించి, పంటకాలువలోని తూడుకాడ, గుర్రపుడెక్క తొలగిస్తున్నామని, శుక్రవారానికల్లా నీరందుతుందని ఈఈ చెప్పారని రైతులకు తెలిపారు. రైతుల పక్షాన నిలబడి పంటపొలాలు తడిసేలా చూస్తామని, పరిస్థితిని చక్కదిద్దుతామని భరోసా ఇచ్చారు. నడకుదురు ఎంపీటీసీ జవ్వాది సతీష్, పెద్దాపురప్పాడు మాజీ సర్పంచ్‌ గొల్లపల్లి ప్రసాదరావు, రైతులు వెలుగుబంట్ల సీతారామరాఘవ, నున్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు