ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద ఉధృతి

17 Jul, 2016 23:52 IST|Sakshi
  • 143.71 మీటర్లకు చేరిన నీరు
  • మంచిర్యాల రూరల్‌ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఆదివారం మంచిర్యాల మండలంలోని గుడిపేట ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్‌) ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో నిండుగా దర్శనమిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు తీయడంతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుకు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్‌ లెవెల్‌ కాగా, శనివారం సాయంత్రం వరకు 143.61 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. తాజాగా ఈ నీటిమట్టం 143.71 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 10.19 టీఎంసీల నీటీ నిల్వ ఉంది. కాగా, ప్రస్తుతానికి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 400ల కూసెక్కుల కాగా, 400 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్టులో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆర్డీవో అయిషా మస్రత్‌ ఖానమ్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు లేదని, ప్రాజెక్టుకు నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని వెంటనే గ్రామాలు ఖాళీ చేయాలని కూడా సూచించామని చెప్పారు. అయితే ముందస్తుగా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక పునరావాస ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఉంచామని వివరించారు.
మరిన్ని వార్తలు