ప్యాకేజీ ఇవ్వకుంటే కదలం

9 Sep, 2017 22:13 IST|Sakshi
ప్యాకేజీ ఇవ్వకుంటే కదలం
న్యాయం జరిగితేనే గ్రామం ఖాళీ చేస్తాం
మా పేర్లు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలి
ఆర్‌ అండ్‌ ఆర్‌లో అక్రమాల నిగ్గుతేల్చాలి
మండిపడుతున్న యువతీ, యువకులు 
పోలవరం:
     పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ జాబితాలో 18 ఏళ్లు పైబడిన పలువురు యువతీ, యువకుల పేర్లు నమోదు కాలేదు. ఈ కారణంగా వందల మంది ప్యాకేజ్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వీరిలో ఎక్కువ మంది బుట్టాయిగూడెం, ఏలూరు కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే. 2006లో మొదటిసారి సర్వే నిర్వహించినపుడు డేటాలో వీరంతా నమోదయ్యారు. ఇటీవల గ్రామాలలో మళ్లీ సర్వే నిర్వహించినపుడు వీరి పేర్లు చదివి, ఉన్నట్లుగా నమోదు చేశారు. తుది జాబితాలో మాత్రం యువతీ, యువకుల పేర్లు లేవు. గ్రామ సభల సమయంలో వీరంతా కళాశాలలు వదిలి స్వంత గ్రామాలకు వచ్చారు. అప్పట్లో ప్యాకేజ్‌ వస్తుందని చెప్పిన అదికారులు, చివరికి జాబితాలో వీరి పేర్లను నమోదు చేయలేదు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎక్కువ మంది ఇంటర్‌ రెండవ సంవత్సరం, డిగ్రీ రెండు, మూడు సంవత్సరాలు చదువుతున్నారు. వీరంతా గిరిజన యువతీ, యువకులు. జాబితాలో పేర్లు లేకపోవడంపై పోలవరం తహసీల్దార్‌ ఎం.ముక్కంటిని అడిగితే ధ్రువీకరణలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ప్యాకేజీ ఇవ్వకపోతే గ్రామం ఖాళీ చేసేది లేదని చెబుతున్నారు. ములగలగూడెంకు చెందిన మూలెం రాధ, కుంజం రామలక్ష్మి తదితరులు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. గాజులగొందికి చెందిన కారం ప్రకాష్, అరగంటి సూర్యకిరణ్‌ తదితరులు ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వీరెవరికీ కూడా ప్యాకేజీ జాబితాలో పేర్లు రాలేదు.
ప్యాకేజీలో నాపేరు రాలేదు....
     నాకు 18 ఏళ్లు నిండాయి. 2006 డేటాలో నాపేరు ఉంది. ఇపుడు తుది జాబితాలో లేదు. తహసీల్దార్‌ను అడిగితే ప్రూఫ్‌లతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. నా పేరు ఎందుకు నమోదు చేయలేదో తెలియటం లేదు.
మడకం కుమారి, ములగలగూడెం, పోలవరం మండలం
     నేను ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్నా. నాకు 18 ఏళ్లు నిండాయి. ప్యాకేజ్‌ జాబితాలో నా పేరు రాలేదు. ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలి. ప్యాకేజ్‌ ఇవ్వాలి.
ముళ్ల రవీంద్రారెడ్డి, గాజులగొంది, పోలవరం మండలం        
 
 
>
మరిన్ని వార్తలు