నమ్మిన బంటే హంతకుడు

1 Feb, 2017 00:37 IST|Sakshi
నమ్మిన బంటే హంతకుడు
– ప్రాణం తీసిన ఈ- పాస్‌ కుంభకోణం
– వెంకటేష్‌ గౌడ్‌ హత్యకు కారణం ఆర్థిక లావాదేవీలు
– విజిలెన్స్, సీసీఎస్‌కు సమాచారం ఇచ్చాడని కక్ష
– విచారణలో తేల్చిన పోలీసులు
– నలుగురు నిందితుల అరెస్టు.. ఎస్పీ ఎదుట హాజరు
– మరో ఐదుగురి కోసం ముమ్మర గాలింపు
 
కర్నూలు : డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ గౌడ్‌ దారుణ హత్య వెనుక కారణాలు ఆర్థిక లావాదేవీలేనని పోలీసులు విచారణలో తేల్చారు. దారుణానికి ఒడిగట్టిన శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులు, ఎరుకలి రాము, సయ్యద్‌ చిన్న మౌలాలి అలియాస్‌ గిడ్డు, దేవావత్‌ శివుడు నాయక్‌లను పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావుతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఏడాది కాలంగా వెంకటేష్‌ గౌడ్‌కు రక్షణ కవచంగా ఉన్న ఎరుకలి శ్రీనివాసులు మరి కొందరి సహకారంతో అతిదారుణంగా వేట కొడవళ్లతో నరికి హత్య చేసినట్లు వెల్లడించారు. 
 
ఈ-పాస్‌ కుంభకోణం సమాచారం లీక్‌ చేశాడని కక్ష 
ఈ-పాస్‌ యంత్రాన్ని బైపాస్‌ చేసి రేషన్‌ బియ్యాన్ని స్వాహా చేసిన ముఠాలోని కొంతమంది డీలర్ల ప్రోత్సాహానికి తోడు డీలర్‌షిప్‌ ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో ఎరుకలి శ్రీనివాసులు.. వెంకటేష్‌ గౌడ్‌పై కక్ష కట్టాడు. డీలర్ల సంక్షేమ సంఘం ఏర్పాటులో కొంతమంది డీలర్లతో వెంకటేష్‌గౌడ్‌కు విభేదాలు ఉన్నాయి. కొంతమంది డీలర్‌షిప్‌లను తీయించాడని అతనిపై కక్ష పెంచుకున్నారు.
 
ఈ నేపథ్యంలో శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులును చేరదీసి డీలర్‌షిప్‌ ఇప్పిస్తానంటూ నమ్మబలికి, ప్రత్యర్థుల నుంచి ముప్పు లేకుండా రక్షణ కవచంగా వినియోగించుకున్నాడు. ఈ-పాస్‌ కుంభకోణంలో భాగంగా నగరంలో సుమారు 100 మందికిపైగా డీలర్‌షిప్‌లు రద్దు అయ్యాయి. అందులో ఎరుకలి శ్రీను స్వయాన సోదరుడైన చంద్రశేఖర్‌ పేరుతో ఉన్న డీలర్‌షిప్‌ కూడా రద్దు అయింది. కొత్తగా డీలర్‌షిప్‌ ఇప్పిస్తానని చెప్పి రూ.2.50 లక్షలు శ్రీను వద్ద నుంచి వెంకటేష్‌గౌడ్‌ తీసుకున్నాడు. డీలర్‌షిప్‌ కోసం తీసుకున్న డబ్బులు వాపస్‌ ఇవ్వాలని కోరుతూ హత్యకు పది రోజుల ముందు కలెక్టర్‌ ఆఫీసులో ఇరువురు గొడవపడ్డారు. డబ్బులు ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ తెగేసి చెప్పడంతో వివాదం ముదిరింది.  
 
వారం రోజుల పాటు రెక్కీ..
డీలర్‌షిప్‌ కోసం డబ్బులు తీసుకోవడమే కాక సంవత్సరం పాటు తన సహకారం తీసుకొని నిర్లక్ష్యం చేయడంతో ఎరుకలి శ్రీను.. వెంకటేష్‌ గౌడ్‌ను హత్య చేసేందుకు మేనమామ ఎరుకలి రాము, అతని బావమరిది చిన్న మౌలాలి, ఆటో డ్రైవర్‌ శివుడు నాయక్‌తో కలిసి రెక్కీ నిర్వహించారు. వారం రోజుల పాటు గౌడు కదలికలపై నిఘా వేసి హత్య చేశారు. వెంకటేష్‌ గౌడ్‌కు ఇద్దరు భార్యలు. రెండో భార్య కర్నూలు శివారుల్లోని జొహరాపురంలో ఉంటుంది. ఇంటి నుంచి ప్రతి రోజు లక్ష్మి గార్డెన్‌ మీదుగా కర్నూలులోని మొదటి భార్య ఇంటికి వస్తుంటాడు. ఇందులో భాగంగా 24వ తేదీ హత్య చేసేందుకు ఎరుకలి శ్రీను పతకం రచించాడు. జొహరాపురంలోని లక్ష్మిగార్డెన్‌ వద్ద మౌలాలి, రాము, డ్రైవర్‌ శివుడుతో కలిసి ఏపీ 21 టీయూ 9180 ఆటోలో మాటు వేశారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటేష్‌గౌడ్‌ మోటర్‌ సైకిల్‌పై అటుగా అదే మార్గం గుండా కర్నూలులోకి వెళ్లాడు. డీలర్‌ జలంధర్‌గౌడ్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఆటోలో అతన్ని అనుసరించి మద్దూరునగర్‌లోని జిరాక్సు సెంటర్‌ వద్ద కాపుకాశారు.
 
స్టూలుపై కూర్చొని ఉన్న అతనిపై నలుగురు ఒకే సారి వేట కొడవళ్లతో దాడి చేసి నరికి హత్య చేశారు. అక్కడి నుంచి కల్లూరు ఎస్టేట్, చెన్నమ్మ సర్కిల్‌ మీదుగా ఆటోలో వెళ్లి రాము ఇంటి వద్ద రక్తపు మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని, వేట కొడవళ్లను ఇంట్లో దాచిపెట్టి పరారయ్యారు. హతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి, నిందితుల కోసం గాలిస్తుండగా శ్రీనివాసులుతో పాటు, మిగిలిన ముగ్గురు నిందితులు కల్లూరు తహసీల్దారు ఎదుట లొంగిపోయారు. నిందితుల స్టేట్‌మెంటును రికార్డు చేసి, వారిని పోలీసు స్టేషన్‌లో హాజరు పరిచారు. వారి ఒప్పందం మేరకు పంచనామా రికార్డు చేసి రాము ఇంటి వద్ద ఉన్న ఆటోను, రక్తపు మరకలు గల బట్టలను, వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హత్యకు ప్రోత్సహించిన రేషన్‌ డీలర్లు జలంధర్‌గౌడ్, గనిబాషా అలియాస్‌ టోపి బాషా, గిడ్డయ్య, పక్కీరయ్య, మాజీ డీలరు కాంతారావు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులు లొంగిపోయేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ మధుసూదన్‌రావు, ఎస్‌ఐలు శ్రీనివాసులు, మల్లికార్జున, ఏఎస్‌ఐ భాస్కర్, హెడ్‌ కానిస్టేబుళ్లు దైవప్రసాద్, శంకర్‌నాయక్, కానిస్టేబుళ్లు దేవదాస్, కిషోర్, విశ్వనాథ్‌ తదితరులను ఎస్పీ అభినందించారు. 
 
మరిన్ని వార్తలు